Telangana News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థినులకు ఎదురైన చేదు అనుభవం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత మూడు రోజులుగా వారికి పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారు. ఈ విషయంపై విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా, అధికారులు పట్టించుకోకపోవడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం పరిస్థితి మరింత దారుణంగా మారింది. అల్పాహారం కోసం తయారుచేసిన 80 కిలోల కిచిడీలో కూడా పురుగులు కనిపించాయి. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సుమారు 600 మంది విద్యార్థినులు భోజనం చేయకుండానే కళాశాలలోని తరగతి గదులకు వెళ్లి నిరసన తెలిపారు. మూడు రోజులుగా ఫిర్యాదు చేస్తున్నా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు వాపోయారు.
భద్రాచలం ఐటీడీఏ ప్రధాన కేంద్రానికి దగ్గరగా ఉన్న ఈ కళాశాలలో ఇలాంటి ఘటన జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గిరిజన విద్యార్థులు కావడం వల్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి.
ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ, జీసీసీ (గిరిజన సహకార సంస్థ) నుంచి వచ్చిన బియ్యంలోనే పురుగులు ఉన్నాయని, ఆ బియ్యాన్ని వెనక్కి పంపినట్లు తెలిపారు. అయితే, విద్యార్థినులు మూడు రోజులుగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నా, తక్షణ చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఘటనపై భద్రాచలం ఐటీడీఏ పీవో బీ రాహుల్ విచారణకు ఆదేశించారు. పీఎంఆర్‌సీ ఆర్‌సీవోను విచారణ అధికారిగా నియమించారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తుతో ముడిపడిన ఈ సమస్యపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.