World Cup: అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత క్రీడాకారులు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. ఒకే ఏడాదిలో నలుగు ప్రపంచకప్‌లు సాధించడం భారత క్రీడా శక్తిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పింది. పురుషుల టీమిండియా టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోగా, మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇటీవల అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌ను కూడా భారత్ గెలుచుకుని ఘనత సాధించింది.
తాజాగా భారత్ ఖాతాలోకి మరో ప్రతిష్టాత్మక టైటిల్ చేరింది. మహిళల కబడ్డీ ప్రపంచకప్ (2025 Kabaddi World Cup) ఫైనల్లో చైనీస్ తైపీ జట్టును 35-28 తేడాతో ఓడించి ఛాంపియన్‌గా నిలిచింది. వరుసగా రెండోసారి ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని గెలవడంతో దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది. క్రీడాభిమానులు, ప్రముఖులు జట్టుకు హర్షధ్వనులు తెలియజేస్తున్నారు.
కెప్టెన్ రీతూ నేకి నాయకత్వంలో భారత మహిళా కబడ్డీ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ విజయానికి విశేషం ఏమిటంటే—జట్టులో ఐదుగురు ఆటగాళ్లు హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారే కావడం. ఈ విజయం భారత కబడ్డీ శక్తిని మరింత బలంగా ప్రపంచానికి చూపించింది.
