Women’s World Cup 2025: అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచం నేడు ఒక మైలురాయి క్షణానికి సాక్ష్యం కానుంది. మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్‌లో ఆతిథ్య భారత్, తొలిసారి ఫైనల్‌కు చేరిన దక్షిణాఫ్రికా జట్లు టైటిల్ పోరుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఎందుకంటే, ఈ రెండు జట్లలో ఏది గెలిచినా… మహిళల వన్డే ప్రపంచ కప్ చరిత్రలో కొత్త ఛాంపియన్ ఖాయం. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల ఆధిపత్యం లేకుండా ఫైనల్ జరగడం ఇదే మొదటిసారి కావడంతో, ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టుకు ఇది మూడో ప్రపంచకప్ ఫైనల్ (2005, 2017 తర్వాత).
Also Read: Kane Williamson: కేన్ మామ గుడ్‌బై: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు విలియమ్సన్ వీడ్కోలు!
గత రెండుసార్లు తుదిమెట్టుపై విఫలమైన భారత్, ఈసారి సొంత గడ్డపై ఆడి విజేతగా నిలిచి కప్పు కరువు తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. సెమీస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. మరోవైపు లారా వోల్వార్డ్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. సెమీ-ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి సత్తా చాటిన ఈ జట్టు, తమ శక్తిమంతమైన పేస్ బౌలింగ్ మరియు అత్యుత్తమ ఫీల్డింగ్‌పై ఆధారపడి ఉంది. టైటిల్ గెలిచి తమ క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం లిఖించాలని దక్షిణాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్ మ్యాచ్‌తో పాటు రిజర్వ్ డే నాడు కూడా ముంబైలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ట్రోఫీని రెండు జట్లకూ ఉమ్మడిగా అందిస్తారు. అభిమానులు మాత్రం పూర్తి మ్యాచ్ జరగాలని కోరుకుంటున్నారు. ఈ ఫైనల్ మ్యాచ్ మహిళల క్రికెట్‌కు కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

