Womens University:హైదరాబాద్ నగరంలోని కోఠిలో ఉన్న వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్) ఎట్టకేలకు గుర్తింపును ఇచ్చింది. ఈ గుర్తింపుతో మూడేండ్ల విద్యార్థినుల సమస్య తీరనున్నది. ఈ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థినుల సర్టిఫికెట్లపై ఇక నుంచి అధికారికంగా వర్సిటీ ముద్ర పడనున్నది. యూనివర్సిటీ ప్రారంభమై మూడేండ్లు పూర్తికావస్తున్నా, యూజీసీ గుర్తింపు దక్కలేదు. దీంతో డిగ్రీ పూర్తిచేస్తున్న విద్యార్థినులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరున ఉండే మెమోలనే జారీ చేయాల్సి వస్తున్నది.
Womens University:యూజీసీ గుర్తింపు విషయాన్ని ఇటీవలే ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ సూర్య ధనుంజయ్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో గత డిసెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టగా,ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం దానికి ఆమోదముద్ర వేసింది. అనంతరం అనుమతి కోసం యూనివర్సిటీ అధికారులు యూజీసీకి లేఖ రాశారు. వర్సిటీ ప్రతిపాదనలను పరిశీలించిన యూజీసీ కమిషన్ తాజాగా గుర్తింపు పత్రాన్ని ఈ-మెయిల్ ద్వారా పంపింది.
Womens University:రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయానికి యూజీసీ గుర్తింపు దక్కడంతో పరిశోధక విద్యార్థులు పీహెచ్‌డీ చేసే అవకాశం దక్కింది. త్వరలోనే పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు దూరవిద్యా విధానం, విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులు ప్రవేశపెట్టాలన్నా యూజీసీ అనుమతులు తప్పనిసరి. అయితే న్యాక్ గుర్తింపును సాధ్యమైనంత వేగంగా పొందాలంటూ యూజీసీ అధికారులు షరతులు కూడా పెట్టారు. తాజాగా గుర్తింపు దక్కడంతో విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన తొలగిపోయింది. ఈ మేరకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.