Women’s T20 World Cup: 14 ఏండ్ల తర్వాత మహిళల టీ20 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ టీమ్ ఫైనల్ చేరుకుంది. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో లోస్కోరింగ్ థ్రిల్లర్ లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించింది. ఫైనల్లో సౌతాఫ్రికా జట్టుతో కివీస్ తలపడనుంది.
Women’s T20 World Cup: విండీస్‌తో జరిగిన సెమీఫైనల్లో ఫస్ట్ న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. జార్జియా ప్లిమర్ 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 33 పరుగలు చేసి టాప్ స్కోరర్ గా నిలవగా.. స్టార్ బ్యాటర్ సుజీ బేట్స్ 26 పరుగులు చేసింది. అయతే విండీస్ బౌలర్లు డాటిన్ 22 పరుగులకు 4 వికెట్లు, అఫీ ఫ్లెచర్ 23 పరుగులకు 2 వికెట్లు తీయడంతో కివీస్‌కు కళ్లెం పడింది. దీంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 128 పరుగుల ఓ మోస్తరు స్కోరుకు న్యూజిలాండ్ పరిమితమైంది.
Women’s T20 World Cup: ఛేదనలో వెస్టిండీస్ .. కివీస్ బౌలర్లను అడ్డుకోవడంలో తడబడింది. కివీస్ స్పిన్నర్లు ఈడెన్ కార్సన్ 29 పరుగులకు 3 వికెట్లు, 14 పరుగులకు 2 వికెట్లు తీసుకున్న అమేలియా ధాటికి విండీస్ తడబడింది. విండీస్‌కు ఆశల్లేని స్థితిలో డాటిన్ 3సిక్సర్లతో 22 బంతుల్లో 33 రన్స్ చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును పోటీలోకి తెచ్చింది. ఆఖరి నాలుగు ఓవర్లలో 34 పరుగులు చేయాల్సి రావడంతో అదే ఊపులో డాటిన్ జట్టును గెలిపించేస్తుందనిపించింది. కానీ తర్వాతి ఓవర్లో అమేలియా.. డాటిన్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను కివీస్ వైపు తిప్పింది. మిగతా విండీస్ బ్యాటర్లు కొంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో మహిళల టి20 ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీ చరిత్రలో న్యూజిలాండ్ 2009, 2010లలో వరుసగా రెండుసార్లు ఫైనల్లోకి ప్రవేశించి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడుతుంది. తద్వారా ఈసారి మహిళల టి20 ప్రపంచకప్‌లో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయమైంది.
