Crime News: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. తన భర్త నల్లగా ఉన్నాడని, తన అందానికి అతను సరిపోడని భావించిన ఒక మహిళ, ప్రియుడితో కలిసి అతడిని దారుణంగా హత్య చేయించింది. కేవలం తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో, సుపారీ గ్యాంగ్‌ను ఆశ్రయించి భర్త ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
థార్ జిల్లాకు చెందిన దేవకృష్ణ (28), ప్రియాంక పురోహిత్ (25) భార్యాభర్తలు. అయితే, కొన్నాళ్లుగా ప్రియాంకకు కమలేష్ పురోహిత్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. తన భర్త చూడటానికి నల్లగా ఉంటాడని, తన స్థాయికి తగడని ఆమె తరచూ భావించేది. ఈ క్రమంలోనే తన ప్రియుడితో కలిసి ఉండటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని వదిలించుకోవాలని పథకం వేసింది. ఇందుకు సురేంద్ర భాటియా అనే వ్యక్తి నేతృత్వంలోని సుపారీ గ్యాంగ్‌కు డబ్బులిచ్చి భర్తను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
పథకం ప్రకారం, ఈ నెల 7వ తేదీ రాత్రి దేవకృష్ణ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో దుండగులు అతడిపై దాడి చేసి హతమార్చారు. ఈ దారుణాన్ని దొంగతనంగా చిత్రీకరించేందుకు ప్రియాంక ప్రయత్నించింది. ఎవరో దొంగలు వచ్చి తనను కట్టేసి, భర్తను చంపి, ఇంట్లో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేస్తూ కన్నీరుమున్నీరైంది. మొదట ఇది దొంగల పనే అని అందరూ నమ్మినా, పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడింది.
ప్రియాంక చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటాను పరిశీలించారు. అందులో కమలేష్‌తో ఆమె నిరంతరం టచ్‌లో ఉన్నట్లు తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో, ప్రియాంక తన ప్రియుడు కమలేష్‌తో కలిసి చేసిన పాపాన్ని ఒప్పుకుంది. తన భర్త రూపం నచ్చలేదని, అందుకే అతడిని అంతం చేశామని వారు అంగీకరించారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
