Warangal: వరంగల్ నగరంలోని ప్రధాన కూడలిలో బుధవారం మధ్యాహ్నం ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ కత్తి పట్టుకుని తన భర్తపై దాడికి ప్రయత్నించడం స్థానికంగా పెద్ద కలకలం రేపింది. కొత్తవాడకు చెందిన శ్రీకాంత్‌కు, జ్యోత్స్న అనే మహిళతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పదేళ్ల వయసున్న కూతురు ఉంది. అయితే, తన భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని, తన ఆస్తులను కూడా ఆక్రమించుకున్నాడని జ్యోత్స్న ఆరోపిస్తోంది. ఈ గొడవతో ఆగ్రహం చెందిన ఆమె, చౌరస్తాలో ఉన్న తన భర్త బంగారు దుకాణం వద్దకు చేరుకుని కత్తితో హంగామా చేసింది.
Also Read: Crime News: డబ్బుల కోసం భర్తను చంపిన ఇల్లాలు.. చివరికి
తన భార్య కత్తితో మీదకు రావడంతో భయపడిన శ్రీకాంత్, ప్రాణాలు దక్కించుకోవడానికి పక్కనే ఉన్న ఒక షాపులోకి వెళ్లి దాక్కున్నాడు. జ్యోత్స్న కత్తితో రోడ్డుపై తిరుగుతుండటంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను వారించి, చాకచక్యంగా ఆమె చేతిలోని కత్తిని లాక్కున్నారు.
మరోవైపు, తన భార్యకు మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే తాను విడాకుల కోసం కోర్టులో కేసు వేశానని శ్రీకాంత్ చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉండగానే ఈ గొడవ జరిగింది. పోలీసులు జ్యోత్స్నను, ఆమె మామను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
