Telangana: రంగారెడ్డి జిల్లాలో అత్యంత బాధాకరమైన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కన్నతల్లి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంటే.. ఏమీ తెలియని ఆ రెండున్నరేళ్ల చిన్నారి రాత్రంతా ఆమె మృతదేహంపై పడి ఏడుస్తూనే ఉంది. షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో జరిగిన ఈ కిరాతక ఘటన స్థానికులను కన్నీరు పెట్టించింది. తెల్లవారుజామున అటుగా వెళ్తున్న రైతులు చిన్నారి ఏడుపు విని వెళ్లగా, అక్కడ కనిపించిన దృశ్యం చూసి వారు నివ్వెరపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
అసలేం జరిగిందంటే?
మృతురాలు శోభ (31)కు పదేళ్ల క్రితమే వివాహం కాగా, ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, నర్సింహులు అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం కారణంగా భర్తతో గొడవలు వచ్చి ఆమె విడిపోయింది. కొంతకాలంగా నర్సింహులుతో కలిసి ఉంటున్న శోభకు రెండున్నరేళ్ల కూతురు పుట్టింది. అయితే గత నెల రోజులుగా ఆమె తన పుట్టింట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో శనివారం (మార్చి 21) నాడు నర్సింహులు ఫోన్ చేసి, కొడుకుకు సైకిల్ కొనిస్తానని చెప్పి ఆమెను షాద్నగర్ రమ్మన్నాడు.
పథకం ప్రకారమే హత్య?
నర్సింహులు పిలుపు మేరకు శోభ తన కుమారుడితో కలిసి షాద్నగర్ వెళ్ళింది. కానీ ఎంతసేపు వేచి చూసినా అతను రాకపోవడంతో తిరిగి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత మళ్ళీ చిన్నారిని తీసుకుని బయటకు వెళ్లిన శోభ, ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డిగూడ పొలాల్లో శవమై కనిపించింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తలపై బండరాయితో కొట్టి అతి దారుణంగా హత్య చేశారు. తల్లి చనిపోయిందన్న విషయం కూడా తెలియని ఆ చిన్నారి, రాత్రంతా ఆ నిర్మానుష ప్రాంతంలో చీకట్లో భయంతో వణికిపోతూ తల్లి పక్కనే గడిపింది.
పోలీసుల దర్యాప్తు
మృతురాలి తల్లి కరుణమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శోభను హత్య చేసింది ఎవరు? నర్సింహులుకు దీనితో ఏమైనా సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ చిన్నారి రోదనలు చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకుంటున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
