Crime News: కామం ముందు రక్త సంబంధాలు నిలబడటం లేదు. పరిచయమై …నాలుగు స్వీట్ డైలాగ్స్ చెప్పి ముగ్గులోకి దింపిన వాడి కోసం…పుట్టినప్పటి నుంచి తోడుగా ఉన్న వారినే చంపేస్తున్నారు. ఆమెకు అతడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం చాలా నచ్చింది. నచ్చిన ఆ బంధాన్ని కంటిన్యూ చేయాలి అనుకున్నారు. కానీ ఇంట్లో వాళ్ళు అడ్డం. మరి ఎలా ? అందుకే ఈ ఐడియా …
హైదరాబాద్ జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. తమ బంధానికి అడ్డు వస్తున్నారనే కారణంతో ప్రియుడితో కలిసి ఓ మహిళ తల్లీ, సోదరిని హతమార్చినట్లు పోలీసుల విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. నార్త్ లాలాగూడకు చెందిన వుడుగుల సుశీలకు జ్ఞానేశ్వరి, లక్ష్మి, ఉమా మహేశ్వరి, శివ సంతానం. వీరంతా అవివాహితులే. పెద్ద కుమార్తె జ్ఞానేశ్వరికి మానసిక స్థితి సరిగా ఉండదు. ఉమా మహేశ్వరి లాల్‌బజార్‌లోని కాల్ సెంటర్‌లో పని చేస్తుండగా, కుమారుడు శివ అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం రైల్వేలో పని చేసే తండ్రి అనారోగ్యంతో మరణించటంతో కారుణ్య నియామకం కింద రెండో కుమార్తె లక్ష్మికి ఉద్యోగం ఇచ్చారు.
లాలాగూడ వర్క్ షాప్‌లో ఉద్యోగం చేస్తున్న లక్ష్మి, సోదరి జ్ఞానేశ్వరితో కలిసి రైల్వే క్వార్టర్స్‌లోనే ఉంటోంది. ఈ క్రమంలో ఉపాధి కోసం యూపీ నుంచి వచ్చి జవహర్‌నగర్‌లో స్థిరపడిన అరవింద్ కుమార్‌తో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. 2010 నుంచే సుశీల కుటుంబంతో ఉన్న అనుబంధంతో లక్ష్మి, అరవింద్ సన్నిహితంగా మెలగసాగారు. ఇది నచ్చని సుశీల, కుటుంబసభ్యులు పలుమార్లు హెచ్చరించారు. తనతో ఉంటున్న సోదరి జ్ఞానేశ్వరి ద్వారానే తల్లికి సమాచారం చేరుతుందని భావించిన లక్ష్మి, జ్ఞానేశ్వరిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. అరవింద్ కుమార్‌తో కలిసి ఈ నెల 3న జ్ఞానేశ్వరిని హతమార్చి మృతదేహాన్ని మూటగట్టి పక్కనే ఉన్న సిమెంట్ కుండీలో వేసి చెత్తాచెదారం వేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు ఉండిపోయారు.
Also Read: Road Accident: రోడ్డు ప్రమాదంలో డీఎస్పీ దుర్మరణం
జవహర్‌గర్‌లోని నివాసంలో సుశీలను సైతం అరవింద్ కుమార్ హతమార్చాడు. ఈ నెల 6న సాయంత్రం 7 గంటల సమయంలో సుశీల ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి పథకం ప్రకారం ఆమెను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. సుశీల ఇంట్లో నుంచి కేకలు విన్న స్థానికులు మరో కుమార్తె ఉమా మహేశ్వరికి సమాచారమిచ్చారు. తర్వాత వారు తీవ్ర గాయాలతో పడి ఉన్న సుశీలను గుర్తించారు. ఉమామహేశ్వరి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, మృతురాలి ఎడమ చేతిలో అగ్గిపెట్టె, చేతి గాజులు, అద్దాలు విరిగినట్లు గుర్తించారు. సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా గోడ దూకి పారిపోయిన వ్యక్తి అరవింద్ కుమార్‌గా గుర్తించారు.
లక్ష్మిని జవహర్‌నగర్ పోలీసులు ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. తమ సంబంధానికి అడ్డువస్తుందనే కోపంతోనే అక్క జ్ఞానేశ్వరిని చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. లాలాగూడ పోలీసులు గుర్తుపట్టేందుకు వీల్లేని విధంగా సంపులో పడి ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు, పరారీలో ఉన్న అరవింద్ కోసం గాలిస్తున్నారు.