Saudi Arabia: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, సౌదీ అరేబియాతో తమ దేశం చేసుకున్న కొత్త రక్షణ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ అణ్వాయుధాలు అవసరమైతే సౌదీ అరేబియాకు అందుబాటులో ఉంటాయని సూచించారు. పాకిస్తాన్-సౌదీ అరేబియా ఇటీవల ‘వ్యూహాత్మక పరస్పర రక్షణ ఒప్పందం’పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఒక దేశంపై దాడి జరిగితే అది రెండు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించబడుతుంది.
రక్షణ ఒప్పందంలో అణ్వాయుధాల అంశం గురించి అధికారికంగా ప్రస్తావించనప్పటికీ, ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ విషయంలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఒక టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, “మాకు ఉన్న సామర్థ్యాలు, మాకు ఉన్న వనరులు ఈ ఒప్పందం ప్రకారం సౌదీ అరేబియాకు అందుబాటులో ఉంటాయి” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ సౌదీ అరేబియాకు ఒక రకమైన అణు రక్షణ కవచం (nuclear umbrella) ఇవ్వడానికి సిద్ధంగా ఉందని సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bollywood Cinema: బాలీవుడ్ కి ఫ్రాంచైజ్ పిచ్చి పట్టింది.. ఫ్లాప్ అయిన పర్లేదు సీక్వెల్స్ తీయాలి..!
గతంలో కూడా, సౌదీ అరేబియా పాకిస్తాన్ అణు కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కుదిరిన ఈ ఒప్పందం, పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. అయితే, ఈ ఒప్పందంపై భారత విదేశాంగ శాఖ స్పందిస్తూ, ఈ పరిణామాలను తమ జాతీయ భద్రత, ప్రాంతీయ, ప్రపంచ స్థిరత్వానికి కలిగే పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపింది.