Crime News: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తలను భార్యలు చంపుతున్న ఘటనలు తరుచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో భర్తను చంపిన ఘటన చోటుచేసుకుంది. కీరైపట్టి గ్రామానికి చెందిన రసూల్ (35) అనే లారీ డ్రైవర్‌ను అతని భార్య అమ్ముబీ (35) తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి హతమార్చింది. అమ్ముబీకి లోకేశ్వరన్‌తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం రసూల్‌కు తెలియడంతో అతను వారిపై చేయి చేసుకున్నాడు. తమ బంధానికి అడ్డు తొలగించుకోవాలని లోకేశ్వరన్ సలహా మేరకు అమ్ముబీ ఈ ఘాతుకానికి పాల్పడింది. లోకేశ్వరన్ ఇచ్చిన పురుగుల మందును అమ్ముబీ సాంబారు అన్నంలో కలిపి తన భర్త రసూల్‌కు పెట్టింది. పిల్లలు ఆ ఆహారాన్ని తినకపోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
ఇది కూడా చదవండి: Suicide: మర్చిపోయిన భర్త.. చివరికి ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలిద్దరు
విషం తిన్న రసూల్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు. వైద్యులు పరీక్షించగా, అతను తిన్న ఆహారంలో విషం ఉన్నట్లు గుర్తించారు. రసూల్ తన భార్యపై అనుమానంతో తన తమ్ముడి భార్య ఆసినా ద్వారా అమ్ముబీ ఫోన్ చెక్ చేయించాడు. ఫోన్ తనిఖీ చేయగా, అమ్ముబీ లోకేశ్వరన్‌తో చేసిన చాటింగ్‌లు, వాయిస్ నోట్స్ బయటపడ్డాయి. అందులో తాను పురుగుల మందును సాంబారు అన్నంలో కలిపినట్లు అమ్ముబీ పేర్కొంది. రసూల్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, అమ్ముబీ , లోకేశ్వరన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి ఫోన్లను తనిఖీ చేయగా, లోకేశ్వరన్‌తో అమ్ముబీ ఒంటరిగా ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా లభ్యమయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రసూల్ మృతి చెందాడు. ఈ ఘటన ధర్మపురి జిల్లాలో సంచలనం సృష్టించింది.

