Crime News: అస్సాం రాజధాని గువాహటిలో ఓ మహిళ భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలోనే పాతిపెట్టిన ఘటన బయటకు వచ్చింది. రోజూ సాధారణంగా జీవిస్తూ, తన భర్త కేరళకు పనిమీద వెళ్లాడని చెప్పి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే కొద్ది రోజులకే ఆమె నాటకం బహిర్గతమైంది.
ఏం జరిగింది?
గువాహటి పాండు ప్రాంతం, జోయ్‌మతి నగర్‌కు చెందిన రహీమా ఖాతున్ (38), సబియాల్ రెహ్మాన్ (38) దంపతులు 15 ఏళ్లుగా వివాహ జీవితం గడుపుతున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పాత ఇనుపసామాన్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఇది కూడా చదవండి: Murder Cases: గత ఐదేండ్లలో దేశవ్యాప్తంగా 785 మంది భర్తల హతం
జూన్ 26న రాత్రి మద్యం మత్తులో భర్తతో ఘర్షణకు దిగిన రహీమా, కోపం ఆపుకోలేక సబియాల్ రెహ్మాన్‌ను కొట్టి చంపింది. తరువాత భయంతో ఇంటి ప్రాంగణంలోనే ఐదు అడుగుల లోతు గుంత తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టింది.
నిజం బహిర్గతం ఎలా అయింది?
రహీమా, భర్త వ్యాపార పనిమీద కేరళకు వెళ్లాడని పక్కింటివారిని నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ రోజులు గడుస్తున్నా అతను తిరిగి రాకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఒకరోజు ఇంటి నుంచి పారిపోవడం అనుమానాలకు మరింత ఆస్కారం కల్పించింది.
సబియాల్ రెహ్మాన్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, జూలై 12న దర్యాప్తు ప్రారంభించారు. చివరికి జూలై 13న రహీమా పోలీస్ స్టేషన్‌కి వచ్చి లొంగిపోయింది. కుటుంబ కలహాల వల్లే గొడవలో భర్త చనిపోయాడని, భయంతో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిపింది.
పోలీసుల అనుమానం
రహీమా ఒక్కతే ఐదు అడుగుల లోతు గుంత తవ్వి భర్త మృతదేహాన్ని పాతిపెట్టడం సాధ్యమా అనే అనుమానం పోలీసులకు కలిగింది. మరెవరైనా ఈ హత్యలో ఆమెకు సహకరించారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.పోలీసులు మృతదేహాన్ని బయటకు తవ్వి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు గురించిన మరిన్ని వివరాలు కొద్దీ రోజులో బయటికి రానున్నాయి.

