Mokshagna: నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఓపెనింగ్ డిసెంబర్ 5న రామానాయుడు స్టూడియోస్ లో జరగాల్సి ఉంది. ఎపీ సీఎం నారా చంద్రబాబుతో పాటు లోకేశ్ హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో మూవీ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్వినీ దీని నిర్మాణ భాగస్వామి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఉండకపోవచ్చుననే వార్తలు కూడా ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడీ సినిమా అనుకున్న రోజున మొదలు కాకపోవడంతో ఆ వార్తలకు బలం చేకూరింది.
మోక్షజ్ఞ జ్వరంతో బాధపడుతుండటం వల్లే షూటింగ్ ప్రారంభోత్సవం జరగలేదని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే… ప్రశాంత్ వర్మతో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని కొందరు, నిర్మాత చెరుకూరి సుధాకర్ వ్యవహార శైలి బాలకృష్ణకు నచ్చలేదని ఇంకొందరు అంటున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం ఉంటుందని వార్తలు వచ్చిన ఒక్క రోజు ముందు నాని సమర్పణలో చెరుకూరి సుధాకర్ చిరంజీవి హీరోగా సినిమాను నిర్మించబోతున్నట్టు ప్రకటించడం జరిగింది. ఒకవేళ మోక్షజ్ఞ – ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ కాన్సిల్ అయినా… మోక్షజ్ఞ హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది. అలానే బాలకృష్ణ సైతం తన స్వీయ దర్శక నిర్మాణంలో ‘ఆదిత్య 369’కు సీక్వెల్ గా ‘ఆదిత్య 999 మ్యాక్’ను మోక్షజ్ఞతో చేస్తున్నట్టు ప్రకటించారు.