Nag Panchami 2025: ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్ష పంచమి తిథి నాడు జరుపుకునే నాగ పంచమి పండుగకు హిందూ సంప్రదాయంలో విశేష ప్రాముఖ్యత ఉంది. చాలా మంది ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు, కానీ అసలు నాగ పంచమి ఎందుకు చేసుకుంటారు, దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటి అని చాలా మందికి తెలియదు. దీని వెనుక కొన్ని నమ్మకాలు, పౌరాణిక కథలు, సామాజిక ప్రాముఖ్యతలు ఉన్నాయి.
పౌరాణిక ప్రాముఖ్యత
నాగ పంచమిని జరుపుకోవడానికి ముఖ్య కారణం పురాణాలలో నాగులకు ఉన్న విశిష్ట స్థానం.
శ్రీ మహావిష్ణువుకు శేషపాన్పు: సృష్టి స్థితి కారుడైన శ్రీ మహావిష్ణువు శేషనాగుపై పవళిస్తాడు. శేషనాగు ఆదిశేషుడిగా, అనంతుడిగా విశ్వాన్ని మోస్తున్నాడని పురాణాలు చెబుతాయి. ఈ కారణం చేత నాగదేవతను పూజించడం విష్ణువును పూజించడంతో సమానం.
శివుడికి ఆభరణం: పరమేశ్వరుడు తన మెడలో నాగాన్ని ఆభరణంగా ధరిస్తాడు. దీనివల్ల ఆయనను నాగభూషణుడని పిలుస్తారు. శివుడికి నాగదేవత చాలా ప్రీతిపాత్రులు. శివరాత్రి రోజున కూడా నాగులను పూజిస్తారు.
Also Read: Udaipur Places: ఉదయ్ పూర్ లోని ఈ ప్రదేశాలను వర్షాకాలంలో అస్సలు మిస్సవ్వొద్దు
సుబ్రహ్మణ్య స్వామికి వాహనం/స్వరూపం: కుమారస్వామి, లేదా సుబ్రహ్మణ్య స్వామిని కూడా నాగ స్వరూపునిగా కొలుస్తారు. కార్తికేయుడు నాగరాజుపై ప్రయాణించడం, నాగదోష నివారణకు సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ఆచారంగా ఉంది.
సముద్ర మథనం: అమృతం కోసం దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథించినప్పుడు, వాసుకి అనే నాగాన్ని తాడుగా ఉపయోగించారని పురాణాలు చెబుతాయి. ఇది నాగుల శక్తికి, ప్రాముఖ్యతకు నిదర్శనం.
తక్షకుడి ఆగ్రహం – జనమేజయుడి యాగం: జనమేజయుడు సర్పజాతిని నాశనం చేయడానికి సర్పయాగం చేసినప్పుడు, ఆ యాగం వల్ల సర్పాలు మరణించకుండా కాపాడటానికి నాగదేవతలను ప్రార్థించిన రోజు నాగ పంచమి అని కొన్ని కథలు చెబుతాయి. ఈ రోజున నాగులను పూజించి శాంతింపజేస్తే, సర్పాల వల్ల ఎలాంటి హాని జరగదని నమ్ముతారు.
సామాజిక, పర్యావరణ ప్రాముఖ్యత
నాగ పంచమి పండుగకు కేవలం పురాణాలే కాదు, సామాజిక, పర్యావరణపరంగా కూడా ప్రాముఖ్యత ఉంది.
వ్యవసాయానికి మేలు: పాములు పొలాల్లోని ఎలుకలు, ఇతర కీటకాలను తిని పంటలను కాపాడతాయి. దీనివల్ల రైతలకు చాలా మేలు జరుగుతుంది. ఈ విధంగా రైతన్నలకు సహాయం చేసే పాములను పూజించడం ద్వారా వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తారు.
సర్ప రక్షణ: నాగ పంచమి రోజున పాములను పూజించడం ద్వారా వాటిని సంరక్షించాలనే సందేశం పర్యావరణానికి చేరుతుంది. పాములను చంపకుండా, వాటికి హాని చేయకుండా ఉండాలని ఈ పండుగ తెలియజేస్తుంది. ఇది జీవవైవిధ్యాన్ని గౌరవించడాన్ని, ప్రకృతిలో ప్రతి జీవికి ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది.
దోష నివారణ: జాతకంలో నాగదోషం ఉన్నవారు, సంతాన లేమి సమస్యలు ఉన్నవారు నాగ పంచమి రోజున పూజలు చేస్తే దోషాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని నమ్ముతారు.