Team India Captain: ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌ను ముగించుకుంటాడని ప్రచారం జరిగింది. కానీ భారత కెప్టెన్ ఎటువంటి రిటైర్మెంట్ ప్రకటన రాలేదు కానీ… కొంతకాలం అతను టెస్ట్‌ల్లో కొనసాగుతానని ప్రకటించాడు. అయితే రోహిత్ తన టెస్ట్ కెరీర్‌ను ఎక్కువ కాలం సాగించడం సాధ్యం కాదనిపిస్తోంది. 38 సంవత్సరాలకు చేరువవుతున్న రోహిత్, ఈ ఏడాది ఏదో ఒక సమయంలో టెస్టులకు గుడ్‌బై చెప్పడం ఖాయంగా కనిపిస్తోంది. అతని వారసుడు ఎవరవుతారనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ పేరు వినిపిస్తోంది. ఈ యువ ఓపెనర్‌ను కెప్టెన్‌గా చేసే విషయంలో బీసీసీఐ ప్రయోగం చేయనున్నట్లు కనిపిస్తోంది.
రోహిత్ తర్వాత కెప్టెన్ ఎవరు అనే ప్రశ్నకు నెల క్రితం జస్ప్రీత్ బుమ్రా పేరే ముందుగా వినిపించింది. అతను ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ అందుబాటులో లేని తొలి మ్యాచ్‌లో నాయకత్వం వహించి ఘనవిజయాన్ని సాధించాడు. అతను జట్టుకు వైస్ కెప్టెన్ కూడా. కానీ ఆల్ ఫార్మాట్ ఫాస్ట్ బౌలర్ అయిన బుమ్రాకు ఫిట్‌నెస్ సమస్యలు ఎక్కువగా వెంటాడుతున్నాయి. ఇదే కారణంగానే టి20 జట్టుకి హార్దిక్ పాండ్యాకు బదులుగా సూర్యకుమార్ యాదవ్ కు పగ్గాలు అప్పగించారు.
పైగా కెరీర్‌ను అత్యుత్తమ స్థాయిలో ఎంత కాలం కొనసాగించగలడనే అనుమానాలు పక్కన పెడితే కెప్టెన్ అయితే మాత్రం అతను ప్రతి సిరీస్ కు అందుబాటులో ఉండవలసి వస్తుంది. అది చాలా కష్టతరమైన విషయం. దీనితో కెప్టెన్‌గా వేరే ప్రత్యామ్నాయాలు చూడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సిరీస్ తరువాత జరిగిన సమీక్ష సమావేశంలో బుమ్రాను కెప్టెన్‌గా చేసే విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని వార్తలు వచ్చాయి. రోహిత్ వారసుడు ఎవరు అనే ప్రశ్నకు కోచ్ గౌతమ్ గంభీర్ యశస్వి జైస్వాల్ సూచించాడు అని సమాచారం.
ప్రస్తుతం యశస్వి జైస్వాల్ వయసు 23 సంవత్సరాలు మాత్రమే. అతను ఇప్పటివరకు 19 టెస్టులు ఆడాడు. ఈ తక్కువ అనుభవంతో, చిన్న వయసులో టెస్ట్ జట్టుకు కెప్టెన్ కావడం సాధారణం కాదు. కానీ చిన్న వయసులోనే కెప్టెన్‌లు అయి గొప్పగా విజయవంతమైన ఆటగాళ్లు ఉన్నారు. దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు గ్రేమ్ స్మిత్ ఈ విషయంలో స్ఫూర్తిగా నిలుస్తాడు. 22 ఏళ్లకే కెప్టెన్ అయ్యాడు. 16 టెస్టుల అనుభవంతోనే అతడిని కెప్టెన్‌గా నియమించింది క్రికెట్ దక్షిణాఫ్రికా. అప్పటినుండి ఏకంగా అతను 109 మ్యాచ్ లలో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్సీ నిర్వహించాడు. అతని సారధ్యంలోనే దక్షిణాఫ్రికా వరుసగా 12 విదేశీ టెస్ట్ సిరీస్ లను ఓడిపోని ఏకైక జట్టుగా రికార్డు నెలకొల్పింది.
అలాగే 2015 లో 25 ఏళ్ల స్టీవ్ స్మిత్ ను క్లాక్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా పూర్తిస్థాయి కెప్టెన్ గా నియమించింది. ఇక విరాట్ కోహ్లీ కూడా 2014లో పాతికేళ్ల వయసులోనే సారథ్య బాధ్యతలు తీసుకొని. గొప్ప టెస్ట్ కెప్టెన్ గా మారాడు. మరి ఇలాంటి యువ టాలెంటెడ్ ప్లేయర్లను దిగ్గజ ఆటగాళ్లుగా మార్చిన కెప్టెన్సీ బాధ్యత… జైస్వాల్ ను కూడా మరొక గొప్ప ప్లేయర్ గా మలుస్తుందో లేదో సమయమే చెబుతుంది.