Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న చర్చకు తెరపడింది. ఆయన దీర్ఘకాలిక సిరల వ్యాధి (Chronic Venous Insufficiency) తో బాధపడుతున్నట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇది సాధారణంగా 70 ఏళ్లు దాటినవారిలో కనిపించే రక్త ప్రసరణ సంబంధిత సమస్య అని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.
ఇటీవల అధ్యక్షుడు ట్రంప్ కాళ్ళ దిగువ భాగంలో, ముఖ్యంగా మడమ వద్ద తరచుగా వాపు కనిపించడంతో వైద్యులు పలు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ట్రంప్‌కు దీర్ఘకాలిక సిరల లోపం ఉన్నట్లు తేలింది. అయినప్పటికీ, డీప్ వీన్ థ్రాంబోసిస్ (రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం), ఆర్టీరియల్ వ్యాధి (ధమనులు మూసుకుపోవడం), గుండె వైఫల్యం లేదా కిడ్నీ వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఎలాంటి అసౌకర్యానికి గురవడం లేదని వైట్‌హౌస్ వెల్లడించింది. తన ఆరోగ్యం పట్ల పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ వివరాలను మీడియాకు తెలియజేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
ఇటీవలే అధ్యక్షుడు ట్రంప్ చేతి వెనుక భాగంలో గాయంలాంటిది కనిపించి మీడియాలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై కూడా కరోలిన్ లీవిట్ స్పందించారు. తరచుగా కరచాలనం చేయడం, ఆస్పిరిన్ వంటి మందులు వాడటం వల్ల ఇలాంటివి సాధారణంగా వస్తాయని ఆమె వివరణ ఇచ్చారు. ప్రస్తుతానికి చికిత్స వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అయితే అధ్యక్షుడి వైద్య బృందం ఆయన ఆరోగ్యంపై పూర్తి దృష్టి సారించింది.
దీర్ఘకాలిక సిరల లోపం అనేది కాళ్ళలోని సిరలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తే ఒక వ్యాధి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం, కాళ్లలోని సిరల్లో ఉండే కవాటాలు బలహీనపడినప్పుడు లేదా దెబ్బతిన్నప్పుడు, రక్తం గుండె వైపు సమర్థవంతంగా ప్రవహించకుండా తిరిగి కాళ్ళల్లోనే పేరుకుపోతుంది. దీనివల్ల కాళ్ళలో వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: CM Revanth Reddy: నాగర్‌కర్నూల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ఈ సమస్య కాలక్రమేణా తీవ్రంగా మారుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలం కూర్చోవడం లేదా నిలబడటం, ఊబకాయం, వయసు పెరగడం (ముఖ్యంగా 70 ఏళ్లు దాటినవారు), లేదా కుటుంబంలో సిరల వ్యాధి చరిత్ర ఉన్నవారిలో ఇది సర్వసాధారణం.
దీని ముఖ్య లక్షణాలు:
కాళ్ళలో నొప్పి లేదా తిమ్మిరి
ఎక్కువసేపు నిలబడిన తర్వాత కాళ్ళు బరువుగా అనిపించడం లేదా అలసట
చీలమండల చుట్టూ వాపు
చర్మంపై దురద లేదా జలదరింపు
చర్మం రంగు మారడం లేదా వెరికోస్ సిరలు కనిపించడం
ప్రాథమిక దశలోనే చికిత్స చేయకపోతే చీలమండలం లేదా దిగువ కాళ్ళ దగ్గర చర్మపు పుండ్లు కూడా రావొచ్చు.
చికిత్సా పద్ధతులు:
ఈ వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం వల్ల వ్యాధి తీవ్రత పెరగకుండా నివారించవచ్చు. కొన్నిసార్లు జీవనశైలి మార్పులు, వ్యాయామం ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. క్రమం తప్పకుండా నడవడం, బరువును అదుపులో ఉంచుకోవడం, రక్త ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి కాళ్ళను ఎత్తులో ఉంచుకోవడం వంటివి సహాయపడతాయి. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు.