Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సోదరుల అభివృద్ధి, సంక్షేమం కేవలం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో బావోజీ మహారాజ్‌ను దర్శించుకున్న ఆయన, అనంతరం గిరిజనులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. గిరిజనులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రస్తుత ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.
దశాబ్దాల కాలంగా గిరిజనులు కలలుగన్న “మా తండాలో మా రాజ్యం” అనే నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ మాత్రమేనని హరీష్ రావు గుర్తు చేశారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీలు పట్టించుకోకపోయినా, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 3,100 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి వారికి ఆత్మగౌరవాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. అంతేకాకుండా, విద్య మరియు ఉద్యోగాల్లో గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచడం వల్లనే నేడు వేలాది మంది గిరిజన బిడ్డలు ఉన్నత చదువులు చదివి డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడుతున్నారని ఆయన వివరించారు.
గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించి, ఊరూరా ఘనంగా నిర్వహించేలా నిధులు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని హరీష్ రావు గర్వంగా చెప్పారు. కొత్తపల్లి ప్రాంతంలో రవాణా సౌకర్యాల కోసం 8 కోట్ల రూపాయలతో బ్రిడ్జిని, గిరిజనుల కోసం 50 లక్షల రూపాయలతో బంజారా భవనాన్ని నిర్మించామని తెలిపారు. అలాగే బావోజీ మహారాజ్ దేవాలయ అభివృద్ధికి కూడా నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అడవి బిడ్డల చిరకాల కోరికైన పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయడమే కాకుండా, వారికి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కూడా అందించిన ఘనత కేసీఆర్‌దేనని హరీష్ రావు అన్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో లంబాడాలకు కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదని ఆయన విమర్శించారు. గిరిజనులను కేవలం ఓట్ల కోసమే వాడుకుంటున్నారని, వారి అభివృద్ధిని కాంగ్రెస్ గాలికొదిలేసిందని హరీష్ రావు మండిపడ్డారు.
