Sprouts: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు (Obesity). దీని కారణంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహం వంటి అనేక అనారోగ్యాలు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. బరువు తగ్గడానికి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల ప్రకారం, రోజూ మొలకెత్తిన పెసలు (Moong Sprouts) తీసుకోవడం ద్వారా బరువును సమర్థవంతంగా నియంత్రించుకోవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
మొలకలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
మొలకెత్తిన పెసలను పోషకాల గనిగా చెప్పవచ్చు. ఇందులో ప్రొటీన్, ఫైబర్తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి ముఖ్యమైన విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పెసలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అదే సమయంలో, ఇందులో ఉండే అధిక ఫైబర్, ప్రోటీన్ కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతాయి. దీనివల్ల ఆకలి తగ్గి, ఆహారం తక్కువగా తీసుకుంటారు, తద్వారా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతం అవుతుంది. అధిక ఫైబర్ ఉండటం వలన ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి, జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. అంతేకాకుండా, ఈ మొలకలను తరచుగా తీసుకోవడం వలన చర్మానికి మేలు జరిగి, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.
Also Read: Health: ఎడమ లేదా కుడి.. ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది?
ఎప్పుడు, ఎలా తీసుకోవాలి?
మొలకలను ముఖ్యంగా ఉదయం అల్పాహారం (Breakfast) సమయంలో తీసుకోవడం ఉత్తమం. రాత్రి భోజనంలో వీటిని తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతారు. మొలకెత్తిన పెసలను నేరుగా తినవచ్చు లేదా వాటికి కొద్దిగా నిమ్మరసం, నల్ల ఉప్పు, మిరియాల పొడి కలిపి రుచికరమైన సలాడ్‌గా తయారుచేసుకుని తినవచ్చు. కూరగాయలు లేదా ఇతర సలాడ్లలో కూడా వీటిని కలుపుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారు వీటిని రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.