World Photography Day 2025: ఒక ఫోటో… అది వేల భావాలను, అసంఖ్యాక జ్ఞాపకాలను పదిలం చేస్తుంది. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక కళ కాదు, అది కాలంతో కరిగిపోని ఓ అద్భుతమైన క్షణం. మనుషుల మధ్య సంబంధాలు, జ్ఞాపకాలు, వింతలు, విశేషాలు.. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని దృశ్యరూపంలో బంధించి మన ముందుకు తీసుకొస్తుంది.
19వ శతాబ్దంలో మొదలైన ఈ అద్భుతమైన కళ, నేటి డిజిటల్ యుగంలో మరింత పురోగతి సాధించింది. ఈ అద్భుతమైన కళ వెనుక ఉన్న కృషి, శాస్త్రం, చరిత్రను గుర్తుచేసుకోవడానికి, అలాగే ఈ కళను నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటారు.
చరిత్రలోకి ఒక తొంగి చూపు
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు 1839లో ఫ్రాన్స్‌లో ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం జోసెఫ్ నైస్ ఫోర్ మరియు లూయిస్ డాగ్యురే అనే ఇద్దరు ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు “డాగ్యురోటైప్” అనే ఒక ఫోటోగ్రఫీ ప్రక్రియను కనుగొన్నారు. దీని తర్వాత, 1839 ఆగస్టు 19న ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ ఆవిష్కరణను ప్రపంచానికి ప్రకటించి, దానికి పేటెంట్ హక్కులు కల్పించింది. ఈ చారిత్రక రోజుకు గుర్తుగా, ప్రతి సంవత్సరం ఆగస్టు 19న ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
ఫోటోగ్రఫీ ప్రాముఖ్యత
జ్ఞాపకాల పదిలం: ఫోటోగ్రఫీ అనేది మన జీవితంలోని అపురూప క్షణాలను, ముఖ్యమైన ఘట్టాలను శాశ్వతంగా పదిలం చేస్తుంది.
కళను ప్రోత్సహించడం: ఈ రోజు ఫోటోగ్రఫీ కళ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, దానిని మరింతమందికి చేరువ చేయడానికి ఒక వేదికగా నిలుస్తుంది.
ప్రతిభకు గుర్తింపు: ఈ రంగంలో తమదైన ముద్ర వేసుకున్న ఫోటోగ్రాఫర్లను గౌరవించి, కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ రోజు దోహదపడుతుంది.
ఈ ప్రత్యేక రోజున ఫోటోగ్రఫీ ప్రదర్శనలు, వర్క్‌షాప్‌లు నిర్వహించడం ద్వారా ప్రజలకు దాని ప్రాముఖ్యతను తెలియజేస్తారు. ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక చిత్రమే కాదు, అది మన హృదయంలోని భావోద్వేగాలను బయటకు తీసుకొచ్చే ఒక కళారూపం.