West Indies: వన్డే క్రికెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా వెస్టిండీస్ జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ వన్డేలో, కరీబియన్ జట్టు తమ ఇన్నింగ్స్ మొత్తంలో ఒక్క వేగవంతమైన బౌలర్ ను కూడా ఉపయోగించకుండా, కేవలం స్పిన్నర్లతో మాత్రమే 50 ఓవర్లు పూర్తి చేసింది. వన్డే ఫార్మాట్‌లో 50 ఓవర్ల కోటాను పూర్తిగా స్పిన్నర్లతో పూర్తి చేసిన తొలి జట్టుగా వెస్టిండీస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. మిర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియం పిచ్‌పై బంతి ఎక్కువగా టర్న్ అవుతుండటం, పగుళ్లు ఉండటం గమనించిన వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. జట్టులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ ఉన్నప్పటికీ, అతడిని బౌలింగ్‌కు దించకుండా, ఐదుగురు స్పిన్నర్లకు పూర్తి కోటా ఇచ్చారు. ఈ స్పిన్ వ్యూహం వెస్టిండీస్‌కు అద్భుతంగా పనిచేసింది.
Also Read: Mohammad Kaif: కుల్దీప్ యాదవ్‌ను షేన్ వార్న్‌తో పోల్చిన కైఫ్!
బంగ్లాదేశ్ బ్యాటర్లు స్పిన్‌ను ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడ్డారు. వెస్టిండీస్ స్పిన్నర్లు అలిక్ అథనాజే (2/14), అకీల్ హొసేన్ (2/41), గుడకేశ్ మోతీ (3/65) సమష్టిగా రాణించి, బంగ్లాదేశ్‌ను 50 ఓవర్లలో 213/7 పరుగులు మాత్రమే చేయనిచ్చారు. బంగ్లాదేశ్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో వెస్టిండీస్ కూడా తడబడింది. కెప్టెన్ షాయ్ హోప్ (53 నాటౌట్) పోరాటంతో నిర్ణీత 50 ఓవర్లలో విండీస్ కూడా సరిగ్గా 213 పరుగులకే పరిమితమైంది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో విండీస్ 11 పరుగులు చేయగా, అకీల్ హొసేన్ వేసిన స్పిన్ బౌలింగ్‌ను బంగ్లాదేశ్ ఎదుర్కోలేకపోయింది. దీంతో విండీస్ ఒక పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. అంతకుముందు వన్డే చరిత్రలో అత్యధికంగా స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన రికార్డు శ్రీలంక పేరిట ఉండేది. శ్రీలంక మూడు వేర్వేరు సందర్భాలలో 44 ఓవర్ల స్పిన్‌ను ఉపయోగించింది. అయితే, తాజాగా 50 ఓవర్ల స్పిన్ కోటా వేసిన వెస్టిండీస్ ఆ రికార్డును అధిగమించింది.