Narendra Modi: ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం పర్యటన ఆ రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలక మైలురాయిగా నిలిచింది. కలియాబోర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, అస్సాం సంస్కృతిని, భూములను కాపాడటంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఓట్ల రాజకీయాల కోసం అక్రమ వలసదారులను ప్రోత్సహించడం వల్ల అస్సాం అడవులు, వన్యప్రాణుల ఆవాసాలు ఆక్రమణకు గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అభివృద్ధి పనుల జోరు ఈ పర్యటనలో ప్రధాని సుమారు రూ. 6,957 కోట్ల విలువైన కాజీరంగా ఎలివేటెడ్ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు. ఇది వన్యప్రాణులకు, ముఖ్యంగా ఖడ్గమృగాలకు వరదల సమయంలో సురక్షిత మార్గాన్ని అందిస్తుంది. పర్యావరణాన్ని కాపాడుతూనే ఆర్థికంగా ఎలా ఎదగవచ్చో భారత్ ప్రపంచానికి చూపిస్తోందని మోదీ పేర్కొన్నారు. వీటితో పాటు అస్సాం నుంచి ఇతర రాష్ట్రాలకు అనుసంధానాన్ని పెంచే రెండు ‘అమృత్ భారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: రౌడీయిజానికి చోటు లేదు.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ ప్రభుత్వం: చంద్రబాబు
బీజేపీపై పెరుగుతున్న ప్రజల నమ్మకం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తన ఉనికిని కోల్పోతోందని, ప్రజలు అభివృద్ధి వైపే మొగ్గు చూపుతున్నారని ప్రధాని అన్నారు. బీహార్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను ఉదాహరణగా చూపుతూ, కాంగ్రెస్ పుట్టిన ముంబైలోనే ఆ పార్టీ వెనుకబడిందని ఎద్దేవా చేశారు. కేరళ రాజధానిలో కూడా బీజేపీ పాలన సాగిస్తోందని, ప్రజల తొలి ఎంపిక ఇప్పుడు బీజేపీయేనని ధీమా వ్యక్తం చేశారు. అస్సాంలో కూడా ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటూ, స్థానిక సంస్కృతిని కాపాడుతున్నామని చెప్పారు.
కళాకారులకు ప్రశంసలు.. అభిమానులకు లేఖలు అస్సాం సంస్కృతిని చాటిచెప్పే బాగురుంబ డ్వౌ నృత్య ప్రదర్శనను ప్రధాని ప్రత్యేకంగా ప్రశంసించారు. 10 వేల మందికి పైగా కళాకారులు పాల్గొన్న ఈ కార్యక్రమం అద్భుతమని కొనియాడారు. సభలో తన చిత్రాలను, స్కెచ్‌లను పట్టుకున్న అభిమానులను చూసి ముచ్చటపడిన మోదీ, వారి వివరాలు సేకరించాలని తన బృందాన్ని ఆదేశించారు. వారికి వ్యక్తిగతంగా లేఖలు రాస్తానని హామీ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు.
