Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి అధునాతన సాంకేతిక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ‘క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ’పై జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ, అమరావతికి ఇప్పటికే అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయని, క్వాంటం టెక్నాలజీపై మరింత దృష్టి సారించనున్నామని తెలిపారు.
క్వాంటమ్ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి:
“అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తాం” అని లోకేష్ అన్నారు. ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో అమరావతిని ముందుంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ నూతన సాంకేతికత భవిష్యత్తులో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని, ఈ అవకాశాన్ని ఏపీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టార్టప్‌లకు స్వాగతం:
అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి, తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి స్టార్టప్ సంస్థలను లోకేష్ ఆహ్వానించారు. నూతన ఆవిష్కరణలకు, సాంకేతిక అభివృద్ధికి అమరావతి సరైన వేదిక అవుతుందని ఆయన వారికి భరోసా ఇచ్చారు. ఇప్పటికే టీసీఎస్, ఐబీఎం, ఎల్&టీ వంటి దిగ్గజ సంస్థలు క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటులో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయని గుర్తుచేశారు. అమరావతిలోని క్వాంటం వ్యాలీ టెక్ పార్క్ భారతదేశంలోనే అతిపెద్ద క్వాంటం కంప్యూటర్ను కలిగి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ 50 ఎకరాల్లో విస్తరించి, క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ పరిశోధన, రక్షణ ఆవిష్కరణలను ఏకీకృతం చేయనుంది. జనవరి 1, 2026 నాటికి ఈ క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.
Also Read: CM Chandrababu: సీఎం చంద్రబాబు: క్వాంటమ్ కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకోవాలి
చంద్రబాబు విజనరీ నాయకత్వం:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం గురించి లోకేష్ ప్రశంసలు కురిపించారు. చంద్రబాబు ఎప్పుడూ సాంకేతికతకు పెద్దపీట వేస్తారని, ఆయన దూరదృష్టి వల్లే రాష్ట్రం సాంకేతిక రంగంలో ముందుకు వెళ్తోందని అన్నారు. 1990ల నాటి ఐటీ విప్లవం నుంచి ప్రస్తుత క్వాంటం యుగం వరకు చంద్రబాబు నాయుడు సాంకేతిక పురోగతికి ప్రాధాన్యతనిచ్చారని లోకేష్ గుర్తు చేశారు.
ఈ వర్క్‌షాప్‌కు హాజరైన ఐటీ, మల్టీనేషనల్ కంపెనీల (ఎంఎన్సీ) ప్రతినిధులకు మంత్రి లోకేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారం, పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతిని కేవలం ఐటీ కేంద్రంగానే కాకుండా, క్వాంటమ్, డీప్-టెక్ రంగాలలో ఆసియాలోనే ముందు వరుసలో నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని లోకేష్ మాటల్లో స్పష్టమైంది.