KTR: రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కేటీఆర్, ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో భారీ అక్రమాలు జరిగాయని, దీనిపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పెద్దలే అండగా నిలబడి అవినీతికి పాల్పడుతున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ అక్రమాలపై అసెంబ్లీలో సభా సంఘం వేయాలని తాము కోరితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం సీఐడీని అడ్డుపెట్టుకుని మంత్రిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేలా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, నిజానిజాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.
ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులే అవినీతి గద్దలుగా మారారని, రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. అందుకే ఈ వ్యవహారంపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. మంత్రి పొంగులేటి పదవిలో ఉంటే విచారణ పారదర్శకంగా జరగదని, అందుకే ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని కేటీఆర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
