TTD Chairman BR Naidu

TTD Chairman BR Naidu: తిరుమల లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంచాం

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవలో ఏడాది టిటిడి ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ముఖ్య నిర్ణయాలు
తిరుమల దేవస్థానం ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు గారు బాధ్యతలు చేపట్టి ఒక ఏడాది పూర్తయిన సందర్భంగా, హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి, ఈ సంవత్సర కాలంలో తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులను వివరించారు. ముఖ్యంగా భక్తులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు కల్పించడంపైనే బోర్డు దృష్టి పెట్టిందని ఆయన స్పష్టం చేశారు.

అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదంలో నాణ్యత పెంపు
భక్తులకు అందించే ప్రసాదాల విషయంలో చాలా మార్పులు వచ్చాయని నాయుడు గారు చెప్పారు. గతంతో పోలిస్తే తిరుమల అన్నప్రసాదంలో మార్పులు తెచ్చి, నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనాన్ని అందిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు నిత్యం 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ముఖ్యంగా లడ్డూ ప్రసాదం నాణ్యత బాగా పెరిగిందని, భక్తులు కూడా ఇవి పది రోజులైనా నిల్వ ఉంటున్నాయని చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

దేవస్థానంలో పారదర్శకత, ఏఐ వినియోగం
పరిపాలనలో పారదర్శకత కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో కాటేజ్‌లకు పెట్టుకున్న సొంత పేర్లు తొలగించి, వాటికి దేవుడి పేర్లు పెట్టాలని నిర్ణయించారు. తొలి బోర్డు మీటింగ్‌లోనే అన్యమతస్థులను తొలగించాలని నిర్ణయించి, కొందరిని తొలగించారు కూడా. భక్తులకు త్వరగా రెండు గంటల్లోనే దర్శనం కల్పించేందుకు ఏఐ ప్రాజెక్టును మళ్లీ కొత్త ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ఆధ్వర్యంలో మొదలు పెడుతున్నామని తెలిపారు. అలాగే, తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడితే చర్యలు తీసుకునేందుకు తీర్మానం చేశారు. టూరిజం ప్యాకేజీలను రద్దు చేసి, ఆ టికెట్లను సామాన్య భక్తులకు ఇస్తున్నారు.

కొత్త నిర్మాణాలు, అభివృద్ధి పనులు
శ్రీనివాస సేతు పేరును గరుడ వారధిగా మార్చారు. గతంలో కొండకు దగ్గరలో ఉన్న ముంతాజ్ హోటల్‌ను సీఎం చంద్రబాబు సహకారంతో అక్కడి నుంచి తొలగించి వేరే చోటికి మార్చారు. ఇష్టానుసారం అనుమతులు ఇచ్చిన దాదాపు 1500 దుకాణాలను క్రమబద్ధీకరిస్తున్నారు.

Also Read: Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం!

* శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 5 వేల ఆలయాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాలు, భజన మందిరాలు నిర్మిస్తారు.

* ప్రతి రాష్ట్ర రాజధానిలో వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించాలని సీఎం ఆదేశాల మేరకు ఇప్పటికే రెండు రాష్ట్రాలు ఆమోదం తెలిపాయి.

* ఒంటిమిట్టలో 100 గదుల వసతి గృహం నిర్మిస్తారు.

* కరీంనగర్‌లో రూ. 30 కోట్లతో, దుబ్బాకలో రూ. 4.5 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించనున్నారు.

* టిటిడి పరిధిలోని అన్ని ఆలయాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఇతర ముఖ్యమైన సంస్కరణలు
* బ్రేక్ దర్శనాలు ఉదయం 10:30 నుండి తిరిగి తెల్లవారుజాముకి మార్చారు.

* తిరుపతి ఫ్లైఓవర్‌కు గరుడ వారధి అని పేరు పెట్టారు.

* సిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ మాఫియాను అరికట్టడానికి, ఆసుపత్రే మెడికల్ షాప్స్ నిర్వహించాలని నిర్ణయించారు.

* తిరుపతి ఎయిర్‌పోర్టుకు శ్రీవెంకటేశ్వర ఎయిర్‌పోర్ట్ అని పేరు పెట్టాలని కోరుతున్నారు. అలాగే, ఎయిర్‌పోర్ట్‌ని చూడగానే ఆలయం గుర్తు వచ్చేలా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

* టికెట్ల జారీలో సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు.

* తిరుమలపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

* టిటిడి కొనుగోళ్ల విభాగంలో జరిగిన అవకతవకలపై ఏసీబీ విచారణకు ఆదేశించారు.

ఈ విధంగా బీఆర్‌ నాయుడు గారు ఛైర్మన్‌గా అనేక సంస్కరణలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతమైన, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *