KTR

KTR: ట్యాపింగ్ డ్రామా అంతా రాజకీయ కక్షే: కేటీఆర్

KTR:  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెడుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. సిట్ విచారణకు హాజరయ్యే ముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ ‘ట్యాపింగ్ డ్రామా’ ఆడుతున్నారని ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, నిజాయితీగా ఉన్నాను కాబట్టే సిట్ పది సార్లు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వ నిఘా వ్యవస్థల పనితీరుపై స్పందిస్తూ, నెహ్రూ కాలం నుండి దేశంలో గూఢచారి వ్యవస్థలు ఉన్నాయని, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు నిఘా అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బ్యాగులతో దొరికిపోయిన సందర్భాల్లో పోలీసులు తమ విధుల్లో భాగంగా నిఘా పెట్టి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేయిస్తున్నారని, దీనిపై ఏ అధికారి అయినా ట్యాపింగ్ జరగడం లేదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా అని ఆయన సవాల్ విసిరారు.

Also Read: Singareni: సింగ‌రేణి విష‌యంలో కేంద్రం ఓ కీల‌క నిర్ణ‌యం

సింగరేణి బొగ్గు కుంభకోణం, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాల నుండి ప్రజలను పక్కదారి పట్టించేందుకే ప్రభుత్వం ఇలాంటి ‘డైలీ సీరియల్’ కథనాలను నడుపుతోందని కేటీఆర్ విమర్శించారు. గత రెండేళ్లుగా తన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా డ్రగ్స్, హీరోయిన్లతో సంబంధాలంటూ తప్పుడు ప్రచారం చేసి తన కుటుంబాన్ని తీవ్ర వేదనకు గురిచేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో ఎప్పుడూ ప్రత్యర్థుల కుటుంబాలను రాజకీయాల్లోకి లాగలేదని, ప్రతిపక్షాలను వేధించలేదని ఆయన గుర్తు చేశారు.

పాలన చేతకాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, పంచాయతీ, జిల్లా పరిషత్ ఎన్నికలను నిర్వహించడానికి భయపడుతోందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, విచారణలు చేసినా తాము భయపడే ప్రసక్తే లేదని, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఆయన తేల్చిచెప్పారు. అవినీతిపై తమ ప్రాణం పోయే వరకు పోరాడుతామని, తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *