Constable Suicide

Constable Suicide: మానసిక వేధింపులకు బలైన మహిళా కానిస్టేబుల్..

Constable Suicide: హనుమకొండ జిల్లాలో ఒక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇద్దరు యువకుల మానసిక వేధింపులు భరించలేక, ప్రాణాల కంటే విలువైంది ఏదీ లేదని భావించాల్సిన రక్షణ శాఖలో ఉన్న మహిళే బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలిచివేస్తోంది.

ప్రేమ పేరుతో వేధింపులు..

వరంగల్ ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనిత, మహబూబాబాద్ జిల్లాకు చెందిన తన దూరపు బంధువు రాజేందర్‌ను పెళ్లి చేసుకోవాలని భావించింది. అయితే, రాజేందర్ ఆమెపై విపరీతమైన అనుమానం పెంచుకున్నాడు. డ్యూటీలో ఉన్నప్పుడు కూడా వీడియో కాల్స్ చేయాలని, వేరే వారితో మాట్లాడకూడదని వేధించేవాడు. అతని ప్రవర్తన నచ్చని అనిత తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించారు.

అందరూ కలిపి వేధించడంతో..

ఈ క్రమంలో అనిత తన క్లాస్‌మేట్ జబ్బార్‌లాల్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాజేందర్, జబ్బార్‌కు ఫోన్ చేసి అనిత గురించి తప్పుగా చెప్పాడు. అప్పటి నుంచి జబ్బార్ కూడా అనితను వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమెను మానసికంగా వేధించాడు.

ఇది కూడా చదవండి: Keerthy Suresh: పెద్దలు ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకునేవాళ్లం: కీర్తి సురేష్

చివరి ఫోన్ కాల్.. 

ఇద్దరి వేధింపులతో తీవ్ర మనోవేదనకు గురైన అనిత, ఈ నెల 27న రాజేందర్‌కు ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుంది. “నువ్వు, జబ్బార్ కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు.. మీ వల్లే చనిపోతున్నాను” అని చెప్పింది. కానీ రాజేందర్ కనికరం లేకుండా “చస్తే చావు” అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన అనిత గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక మహిళా కానిస్టేబుల్ తన సమస్యను పై అధికారులకు చెప్పుకోకుండా లేదా చట్టపరంగా ఎదుర్కోకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *