Hanumakonda: వరంగల్ జిల్లాలో హృదయాన్ని కలచివేసే ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను అమానవంగా చిత్రహింసలు చేసిన ఘటన స్థానికులను తీవ్ర షాక్‌కు గురిచేసింది.
వివరాల్లోకి వెళితే… తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలానికి చెందిన వ్యక్తి రాజుతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఇటీవల రాజు ఓ సన్నిహిత బంధువైన వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం బయటపడడంతో, ఇద్దరూ కలిసి గ్రామం నుంచి పారిపోయారు.
ఈ విషయం తెలిసిన రాజు కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోతూ, వారిని వెతికి పట్టుకుని తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. అనంతరం ఆ మహిళను ఇనుప గ్రిల్స్‌కు కట్టి, ఆమెను బట్టలులేకుండా ఉంచి, జననాంగాలపై జీడి పోసి చిత్రహింసలు చేశారు. ఆమె కన్నీళ్లతో ‘క్షమించండి’ అని వేడుకున్నప్పటికీ, వారు వినిపించుకోలేదు. అనంతరం రాజు, మహిళ ఇద్దరికీ గుండు గీయించారు.
ఇది కూడా చదవండి: Donald Trump: ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. అధ్యక్ష పదవి ఆషామాషీ కాదు
ఈ దారుణం ఐదు రోజుల క్రితం జరిగినా, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కేసు వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందించిన ధర్మసాగర్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడిలో పాల్గొన్న కొంతమంది కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక పరారీలో ఉన్న రాజు, బాధిత మహిళ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది.
ఈ ఘటనపై నెటిజన్లు, మహిళా సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. మహిళలపై జరిగే ఇలాంటి అమానవీయ దాడులను ఖండిస్తూ, బాధితురాలికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

