Warangal Chpata Chilli:మన వరంగల్ చపాటా రకం మిర్చికి అరుదైన గుర్తింపు దక్కింది. ఆ రకం మర్చి అన్నిరకాలుగా నాణ్యతగా ఉండటంతోపాటు మార్కెట్‌కు అనుగుణంగా గిరాకీ ఉన్నది. దీనికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ గుర్తింపు దక్కింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ధ్రువీకరణ పత్రం అందింది. ఈ విషయాన్ని రాష్ట్రంలోని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి (వీసీ) దండా రాజిరెడ్డి వెల్లడించారు.
Warangal Chpata Chilli:ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాటిలో వరంగల్ చపాటా రకం మిర్చి 938వది కాగా, రాష్ట్రం నుంచి గుర్తింపు పొందిన వాటిలో 18వది. వివిధ ప్రత్యేకతలు ఉన్న ఈ వరంగల్ మిర్చికి భౌగోళిక గుర్తింపు కోసం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేట మిరపరైతు ఉత్పత్తిదారుల సంఘం, మహబూబాబాద్ జిల్లాలోని మల్యాలలోని ఉద్యాన పరిశోధన కేంద్రం, కొండా లక్ష్మణ్ వర్సిటీ సంయుక్తంగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ గుర్తింపునకు దరఖాస్తును సమర్పించాయి.
Warangal Chpata Chilli:ఈ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ సమగ్ర అధ్యయనం చేసింది. ఈ మేరకు భౌగోళిక గుర్తింపునకు ఆమోదముద్ర వేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసింది. దీంతో మన రాష్ట్రానికి గుర్తింపు దక్కినట్టయింది. ఈ మేరకు ఆయా రైతులు, వర్సిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు.
Warangal Chpata Chilli:టమాటా ఆకారంలో ఉండే ఈ వరంగల్ చపాటా మిరపకాయ పండ్లు లావుగా, ప్రకాశవంతంగా ఎరుపు రంగలో ఉంటాయి. అందుకే వీటిని టమాటా మిరపకాయ అని కూడా పిలుస్తుంటారు. తక్కువ ఘాటుతో రుచికరంగా, శుద్ధి ఉండే ఈ మిరప రకం ఎగుమతికి అనువుగా ఉంటాయి. పచ్చళ్లకు ఈ చపాటా మార్చి పౌడర్‌ను అధికంగా వాడుతూ ఉంటారు. దీంతోపాటు వస్త్ర పరిశ్రమల్లో, ఔషధ, పానీయాలు, సౌందర్య సాధనాలు, మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాల తయారీకి ఈ చపాటా మిర్చిని, రంగును వాడుతుంటారు.
Warangal Chpata Chilli:ఇదిలా ఉండగా ఈ చపాటా రకం మిరపకాయలను ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద మొత్తంలో సాగు చేస్తుంటారు. ఇక్కడ సుమారు 20 వేల మందికి పైగా రైతులు, ఏటా సుమారు 7 వేల ఎకరాల్లో 10 వేల టన్నులకు పైగా ఉత్పత్తి చేస్తున్నారు. ఆ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సుమారు 8 దశాబ్దాలుగా ఈ పంటనే సాగు చేస్తూ వస్తున్నారు. ఇప్పడు భౌగోళిక గుర్తింపు దక్కడంతో జిల్లాలో సాగు విస్తీర్ణం మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.