Team India: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐలో కీలక చర్చ జరుగుతోంది. పరిమిత ఓవర్ల క్రికెట్ (వన్డే, టీ20)లో గంభీర్ నేతృత్వంలో భారత్ మంచి విజయాలు సాధించినప్పటికీ, టెస్టుల్లో మాత్రం వరుస వైఫల్యాలు ఎదురవుతున్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ చేతిలో 0-3తో, తాజాగా దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సొంతగడ్డపై భారత్ వైట్‌వాష్‌కు గురైంది. ఈ నేపథ్యంలో టెస్టు జట్టుకు ప్రత్యేకంగా మరో కోచ్‌ను నియమించాలనే యోచనలో బోర్డు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను బీసీసీఐలోని ఒక కీలక అధికారి సంప్రదించినట్లు సమాచారం.
టెస్టు జట్టు బాధ్యతలు చేపట్టాలని కోరినప్పటికీ, లక్ష్మణ్ అందుకు సుముఖత చూపలేదని సమాచారం. ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో హెడ్ ఆఫ్ క్రికెట్‌గా ఉన్న ఆయన, ఆ పదవిలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గంభీర్ కోచ్‌గా వచ్చిన తర్వాత టెస్టుల్లో నిలకడ లేకపోవడం, జట్టు ఎంపికలో ప్రయోగాలు బెడిసికొట్టడం వంటి అంశాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ల రిటైర్మెంట్ తర్వాత జట్టులో ఒక రకమైన అభద్రతాభావం నెలకొందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: Vaibhav Suryavanshi: యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి రాష్ట్రీయ బాల పురస్కార్
ప్రస్తుతానికి గంభీర్‌కు బీసీసీఐ ఉన్నతాధికారుల నుంచి మద్దతు ఉన్నప్పటికీ, వచ్చే 2026 టీ20 ప్రపంచకప్ ఫలితం ఆయన పదవికి అత్యంత కీలకం కానుంది. ఒకవేళ ఆ టోర్నీలో భారత్ ఆశించిన స్థాయిలో రాణించకపోతే, గంభీర్ ఒప్పందాన్ని బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయనకు కాంట్రాక్ట్ ఉన్నా, టెస్టుల కోసం ప్రత్యేక కోచ్‌ను నియమించే “స్ప్లిట్ కోచింగ్” విధానంపై టీ20 ప్రపంచకప్ తర్వాత ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడం గంభీర్‌కు కలిసివచ్చే అంశమని బోర్డు వర్గాలు అంటున్నాయి.
