Vontimitta: శ్రీరాముల వారు కొలువై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంటిమిట్టకు మరో ఖ్యాతి దక్కేలా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. ఒంటిమిట్టలోని ఓ చెరువు మధ్యలో శ్రీరాముడి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు సమగ్ర నివేదికను టీటీడీ ఉన్నతాధికారులకు అందజేశారు.
Vontimitta: వచ్చే 30 ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఒంటిమిట్ట రూపు రేఖలను సమూలంగా మార్చేందుకు కూడా టీటీడీ ప్రణాళికలను రూపొందిస్తున్నది. జాతీయ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, చెరువు మధ్యలో శ్రీరాముడి 600 అడుగుల అతి ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే టీటీడీ నిపుణులు ఏర్పాట్లపై సమాలోచనలు చేస్తూనే ఉన్నారు.
Vontimitta: కడప-రేణిగుంట జాతీయ రహదారి, చెన్నై-ముంబై రైలు మార్గం మధ్యలో ఒంటిమిట్టలో ఈ చెరువు ఉన్నది. హైవేలపై వాహనాల్లో వెళ్లేవారు సైతం ఈ భారీ విగ్రహాన్ని చూసేలా అందంగా మలిచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా చెరువు మధ్యలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Vontimitta: వాస్తవంగా ఇప్పటికే ఒంటిమిట్ట టీడీపీ పరిధిలోకి వెళ్లింది. ఒంటిమిట్టను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా సీతారాముల కల్యాణోత్సవాన్ని టీటీడీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. అలాగే భక్తుల కోసం టీటీడీ ఉచిత ప్రసాదం కూడా అందజేస్తున్నది.