Crime News: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చల్లావాని తోట పంచాయతీకి చెందిన నడుపూరు గ్రామంలో జరిగిన దారుణ ఘటన అందరినీ తీవ్రంగా కలచివేసింది. పాండ్రంకి అప్పలనాయుడు (55), జయ (53) దంపతులు అక్కడ నివాసం ఉంటున్నారు. వీరికి కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధ ఉన్నారు.
అప్పలనాయుడు చిన్న రైతు. తనకున్న 80 సెంట్ల భూమిలో కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని కుటుంబ పోషణ సాగించేవాడు. కుమార్తె రాధకు ఏడేళ్ల క్రితం వివాహం జరిపారు. రాధకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆమె భర్త మరణించడంతో, అప్పలనాయుడు దంపతులు ఆమెకు ఆదరణగా నిలిచారు.
రాజశేఖర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ, రెండేళ్ల క్రితం వల్లాపురం గ్రామానికి చెందిన యువతితో పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి తర్వాత చెడు అలవాట్లకు బానిసై అప్పుల ఊబిలో కూరిగిపోయాడు. ఈ నేపథ్యంలో అప్పలనాయుడు దంపతులు తమ 80 సెంట్ల భూమిలో 50 సెంట్లు కూతురు రాధ పేరిట రిజిస్టర్ చేసి ఇచ్చారు, ఆమె భవిష్యత్తు కోసం.
ఈ విషయం తెలిసిన రాజశేఖర్, ఆస్తి విషయంలో తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. ఇటీవల తన అప్పులను తీర్చేందుకు మిగిలిన భూమిని అమ్మడానికి ట్రాక్టర్, జెసిబి సహాయంతో చదును ప్రారంభించాడు. దీనిని గమనించిన అప్పలనాయుడు దంపతులు, కూతురికి ఇచ్చిన భూమిని కూడా చదును చేస్తున్నాడని, అడ్డుకునేందుకు పొలానికి వచ్చారు.
ఇది కూడా చదవండి: Crime News: సినిమాలకు బానిస అయ్యాడు.. ప్రైవేట్ పార్ట్ నరికి.. ఇద్దరిని చంపిన సీరియల్ కిల్లర్
అయితే పట్టరాని కోపంతో రాజశేఖర్ ట్రాక్టర్ ఎక్కి, తల్లిదండ్రులను ఢీకొట్టే ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రులు పరుగు పెట్టినా, రాజశేఖర్ వారిని మళ్లీ వెంటాడి ట్రాక్టర్‌తో ఢీకొట్టి అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ దారుణ ఘటన కొన్ని క్షణాల్లోనే ముగిసిపోయింది. స్థానికులు భయంతో పరుగులు తీశారు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రాజశేఖర్ కోసం గాలింపు చేపట్టారు. అప్పలనాయుడు దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విజయనగరం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.