Vizag

Vizag: విశాఖ పోక్సో కేసులో 12 ఏళ్ల తర్వాత చిక్కిన నిందితుడు..

Vizag: విశాఖపట్నం నగరంలో సుమారు పన్నెండేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ఒక నేరానికి సంబంధించిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు కటకటాల వెనక్కి నెట్టారు. 2014వ సంవత్సరంలో అల్లిపురం ప్రాంతానికి చెందిన ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన మహమ్మద్ సల్మాన్ ఖాన్ అనే వ్యక్తిపై అప్పట్లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఆ సమయంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినప్పటికీ, కొద్దిరోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన సల్మాన్ కోర్టు విచారణకు హాజరుకాకుండా పరారయ్యాడు. అప్పటి నుండి పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న ఈ నిందితుడు ఏకంగా ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి తలదాచుకున్నాడు.

చాలా ఏళ్లు గడిచినప్పటికీ ఈ పాత కేసును సవాలుగా తీసుకున్న విశాఖ పోలీసులు, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి, నిందితుడు ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌లో ఉన్నట్లు పక్కా సమాచారం సేకరించాయి. వెంటనే అక్కడి పోలీసుల సహకారంతో అతడిని అదుపులోకి తీసుకున్న విశాఖ టూ టౌన్ పోలీసులు, నిందితుడిని నగరానికి తీసుకువచ్చారు. పన్నెండేళ్ల పాటు చట్టం నుండి తప్పించుకోవాలని చూసిన సల్మాన్‌ను చివరకు కోర్టులో హాజరుపరిచి మళ్లీ రిమాండ్‌కు తరలించడంతో ఈ సుదీర్ఘ గాలింపు ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *