MP Bharat: విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం, అభివృద్ధి చెందడం వైసీపీకి అస్సలు ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. పేద ప్రజలను ఎప్పటికీ పేదలుగానే ఉంచాలనేది వారి విధానమని, అభివృద్ధి అంటే ఏదో విరగ్గొట్టడం, అడ్డుకోవడమని వారు భావిస్తున్నారని శ్రీభరత్ మండిపడ్డారు.
విశాఖలో జరుగుతున్న ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు గురించి మాట్లాడుతూ… సుమారు రూ. 9.8 లక్షల కోట్లు విలువైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఐటీ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. విశాఖ సుందరీకరణ గురించి స్పందిస్తూ.. చేసిన ఖర్చు అంతా కేవలం షో కోసం కాకుండా, ప్రతి పైసా ప్రజలకు విలువైన విధంగా ఉపయోగపడాలని తాము చూస్తున్నామని ఎంపీ స్పష్టం చేశారు.
పరిశ్రమలకు భూములు కావాలన్నా, మెడికల్ కళాశాలల కోసం పెట్టుబడులు వస్తున్నా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని శ్రీభరత్ ఆరోపించారు. మెడికల్ కళాశాలలపై ప్రేమ ఉంటే, రుషికొండపై రూ. 500 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారని ఆయన ప్రశ్నించారు. అడ్డుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు.
రాష్ట్రం ఇప్పుడు ఆర్థికంగా కష్టాల్లో ఉందని, అన్నింటినీ సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని శ్రీభరత్ అన్నారు. గతంలో ముఖ్యమంత్రి పర్యటనకు రూ. 7 కోట్లు ఖర్చు అయ్యేదని, కానీ ఇప్పుడు అది కేవలం రూ. 25 లక్షలు మాత్రమే అవుతోందని చెప్పారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంత తక్కువ ఖర్చు చేస్తోంది అనడానికి నిదర్శనం అని వివరించారు. చివరగా, వైసీపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ… ఆ పార్టీలో “బండ బూతులు తిడితే నామినేటెడ్ పదవి, మర్డర్ చేస్తే మంత్రి పదవి ఇస్తారు” అంటూ విశాఖ ఎంపీ శ్రీభరత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

