Vizag: గూగుల్ సెంటర్ పై కర్ణాటక మంత్రి విమర్శలు.. ఘాటుగా స్పందించిన బిజెపి

Vizag: విశాఖపట్నంలో టెక్ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ చుట్టూ ఇప్పుడు రాజకీయ చర్చలు వేడెక్కుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన భారీ ప్రోత్సాహకాలపై కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి.

ప్రియాంక్ ఖర్గే మాట్లాడుతూ, విశాఖపట్నంలో గూగుల్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 25 శాతం భూమి, ఉచిత నీరు, విద్యుత్ అందిస్తోందని ఆరోపించారు. ఇంతటి భారీ రాయితీలను ఏ రాష్ట్రం అయినా భరించగలదా అని ప్రశ్నించారు. పెట్టుబడులను ఆకర్షించడానికి రాష్ట్రాలు ఇంతగా పోటీ పడటం సరైన ధోరణి కాదని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఖర్గే వ్యాఖ్యలు బాధ్యతారహితమని విమర్శిస్తూ, భారతదేశంలో కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తును బలోపేతం చేసే పెట్టుబడిని విమర్శించడం సిగ్గుచేటు అని పేర్కొంది. ప్రపంచస్థాయిలో పోటీపడే ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కర్ణాటక వెనుకబడిపోతుందని, ఆ విషయాన్ని మంత్రి ఖర్గే గ్రహించాలని బీజేపీ సూచించింది.

ఏపీ బీజేపీ ప్రకటనలో, బెంగళూరులో మౌలిక సదుపాయాల సమస్యలు తీవ్రంగా ఉన్న వేళ, ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతలో భాగంగా “భారత్ ఏఐ శక్తి” దిశగా ముందుకు సాగుతోందని తెలిపింది. విశాఖలో నిర్మిస్తున్న డేటా సెంటర్ దేశంలోనే అతిపెద్ద ఏఐ హబ్‌గా మారనుందని, ఇది రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశానికి గర్వకారణమని పేర్కొంది.

ఈ వివాదంతో టెక్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో భారత రాష్ట్రాల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ మరోసారి బహిర్గతమైంది. అభివృద్ధి కోసం రాయితీల పరిమితి ఎక్కడ ఉండాలి, టెక్ పెట్టుబడుల దిశలో రాష్ట్రాలు ఏ విధానాన్ని అనుసరించాలి అనే చర్చ ఇప్పుడు నూతన దశలోకి ప్రవేశించింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *