Vishakapatnam: విశాఖలో కలకలం.. వివాదాస్పద ఆర్డీవో శ్రీలేఖ బదిలీ

Vishakapatnam: విశాఖపట్నం రెవెన్యూ శాఖలో నెలకొన్న అంతర్గత వివాదాలపై ఏపీ ప్రభుత్వం కఠినంగా స్పందించింది. ఆర్డీవో పి. శ్రీలేఖ మరియు డీఆర్వో బీహెచ్. భవానీ శంకర్ ల మధ్య నెలకొన్న తగాదాల నేపథ్యంలో ఇద్దరినీ బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవలి రోజుల్లో ఇద్దరు అధికారుల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తాయి. డీఆర్వో తహసీల్దార్ కార్యాలయాల నుంచి వసూళ్లు చేస్తున్నారని ఆర్డీవో శ్రీలేఖ జిల్లా కలెక్టర్‌కి లేఖ రాయడం పెద్ద సెన్సేషన్ అయింది. మరోవైపు, పెందుర్తి మండలంలో విగ్రహం తొలగింపు యత్నంపై కలెక్టర్ శ్రీలేఖకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

ఈ వివాదం బహిర్గతం కావడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంది. రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఇద్దరు అధికారులను బాధ్యతల నుంచి తప్పించి జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

వారి స్థానంలో ఎస్. విద్యాసాగర్ను కొత్త విశాఖ ఆర్డీవోగా నియమించగా, జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర అశోక్కు డీఆర్వో బాధ్యతలు అదనంగా అప్పగించారు.

పరిపాలనపై ప్రభావం పడకుండా, ప్రజాసేవలు అంతరాయం లేకుండా కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ బదిలీల వ్యవహారం విశాఖ రెవెన్యూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *