Vishakapatnam: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటైంది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే (South Coast Railway – SCoR) జోన్ ఏర్పాటు చేయాలని భారత రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో ఉత్తరాంధ్ర ప్రజల ఎప్పటి నుంచో ఉన్న ఆశ నెరవేరింది.
ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్‌ను “విశాఖ డివిజన్” గా మారుస్తారు. అలాగే విశాఖ డివిజన్‌తో పాటు విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ లో భాగం కానున్నాయి.
అంతేకాకుండా, సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న కొండపల్లి-మోటుమర్రి సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌లో విలీనం చేయనున్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతం సికింద్రాబాద్ డివిజన్‌లో ఉండగా, ఇకపై విజయవాడ డివిజన్‌లో భాగంగా పరిగణించనున్నారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్ మొత్తం 410 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త జోన్ ఏర్పాటుతో రాష్ట్రంలోని రైల్వే సేవలు మరింత మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా, ప్రాంతీయ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ ప్రత్యేక జోన్ వల్ల రైల్వే పరిపాలన మరింత మెరుగై, ప్రయాణ సౌకర్యాలు, కొత్త రైళ్ల సౌకర్యం, రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి జరగనుంది. విశాఖపట్నం రైల్వే కేంద్రంగా అభివృద్ధి చెందడం వల్ల ఆర్థిక ప్రగతి, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశంఉంది.