Visakhapatnam: విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ రాక కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేయబడ్డాయి. రెండు రోజులపాటు 35 మంది ఐపీఎస్ అధికారులతో పాటు 5,000 మంది పోలీసులను మోహరించి, అనుమతి లేని ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించారు. ప్రధాని మోదీ రేపు (బుధవారం) విశాఖపట్నం రావడంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) పోలీసులతో పాటు మరింత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ప్రధాని మోదీ విశాఖకు లక్షల కోట్లు విలువ చేసే అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు వస్తున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 1.5 కిలోమీటర్ల రోడ్‌షోలో ప్రధాని పాల్గొననున్న నేపధ్యంలో, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.
అదే విధంగా, ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్‌కు 2 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు ఆధార్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేశారు. భారీ బహిరంగ సభకు శ్రీకాకుళం, విజయనగరం, ఉమ్మడి విశాఖ జిల్లాల నుంచి 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండడంతో, రూట్ ప్లానింగ్, రోప్ పార్టీలు, స్ట్రైకింగ్ ఫోర్స్, డామినేషన్ టీమ్స్, క్విక్ రియాక్షన్ టీమ్స్ ఏర్పాట్లు చేసిన అధికారులు ట్రైల్స్ రన్స్‌ను కూడా నిర్వహించారు.
గత పది రోజుల్లో ప్రధానమంత్రి మోదీ పర్యటనపై అధికారులు పలు సమీక్షలు నిర్వహించారు. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇతర మంత్రులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.