Crime News: విశాఖనగరంలోని ఎల్.వి. నగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి గోరమైన హత్య జరిగింది. నేవీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చింతాడ రవీంద్ర (35) అనే వ్యక్తి, తన పాత పరిచయస్తురాలైన మౌనిక (29) ను అత్యంత పాశవికంగా హతమార్చాడు. నిందితుడు మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. హత్య అనంతరం నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడంతో ఈ దారుణం బయటపడింది.
హత్యకు దారితీసిన పరిస్థితులు
విజయనగరం జిల్లా రాజాంకు చెందిన రవీంద్ర విశాఖలోని ఒక అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. నెల రోజుల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లడంతో, ఆదివారం రాత్రి మౌనికను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన రవీంద్ర ఆమెను కిరాతకంగా చంపేశాడు.
నిందితుడు లొంగిపోయిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఫ్రిజ్‌లో శరీర భాగాలు లభ్యమవ్వగా, తల భాగం కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు.
డబ్బుల కోసమే వేధింపులని నిందితుడి వాంగ్మూలం
పోలీసుల విచారణలో నిందితుడు రవీంద్ర సంచలన విషయాలు వెల్లడించాడు. మౌనిక గత కొంతకాలంగా తనను డబ్బుల కోసం వేధిస్తోందని, ఆ మానసిక హింస భరించలేకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపాడు. అయితే, ఇది కేవలం డబ్బుల కోసమే జరిగిన గొడవా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ నగరంలో ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడం శాంతిభద్రతల దృష్ట్యా ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
