Germany

Germany: జర్మనీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇండియన్స్ కు గుడ్ న్యూస్

Germany: జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ భారతదేశ పర్యటన సందర్భంగా భారతీయులకు ఒక గొప్ప శుభవార్త అందించారు. జర్మనీ విమానాశ్రయాల మీదుగా ఇతర దేశాలకు ప్రయాణించే భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఇకపై ‘వీసా రహిత ట్రాన్సిట్’ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు జర్మనీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడమే కాకుండా, భారత్, జర్మనీ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

జనవరి 12 నుంచి 13 వరకు జరిగిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ మొదటి భారత పర్యటనలో భాగంగా విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆసియా ఖండంలో మెర్జ్ పర్యటించిన మొదటి దేశం భారత్ కావడం విశేషం. ఈ కొత్త సదుపాయం వల్ల, భారతీయ ప్రయాణికులు జర్మనీ విమానాశ్రయాల ద్వారా మూడో దేశానికి వెళ్లేటప్పుడు ప్రత్యేకంగా ట్రాన్సిట్ వీసా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా, ప్రయాణికులకు కాగితపు పనుల భారం తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: Uttam Kumar: తెలంగాణ వ్యవసాయ చరిత్రలో కొత్త రికార్డు..

ఈ నిర్ణయం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేస్తూ ఛాన్సలర్ మెర్జ్‌కు ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ప్రజల మధ్య సంబంధాలు కీలకమని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు. విద్యార్థులు, పరిశోధకులు, నిపుణులు, పర్యాటకుల రాకపోకలు పెరగడం వల్ల పరస్పర అవగాహన పెరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. జర్మనీ ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక అభివృద్ధిలో భారతీయ సమాజం చేస్తున్న కృషిని ఈ సందర్భంగా జర్మనీ ఛాన్సలర్ కొనియాడారు.

విద్యా,నైపుణ్యాభివృద్ధి రంగాల్లో సహకారంపై కూడా ఈ చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జర్మనీలో పెరుగుతున్న భారతీయ విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, ఉమ్మడి డిగ్రీ ప్రోగ్రామ్‌లను విస్తరించాలని నిర్ణయించారు. భారతీయ విద్యార్థులు జర్మనీ జాబ్ మార్కెట్‌లో సులభంగా కలిసిపోయేలా ప్రత్యేక చొరవలు చేపట్టనున్నారు. అలాగే, ఐఐటీలు, జర్మన్ సాంకేతిక విశ్వవిద్యాలయాల మధ్య సంబంధాలను పెంచడానికి ‘ఇండో-జర్మన్ కాంప్రహెన్సివ్ రోడ్‌మ్యాప్’ను రూపొందించాలని అంగీకరించారు. భారత నూతన విద్యా విధానం కింద జర్మనీలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు భారత్‌లో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ప్రధాని మోదీ ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *