Virgin Boys Review

Virgin Boys Review: “వర్జిన్ బాయ్స్” సినిమా రివ్యూ & రేటింగ్

Virgin Boys Review: ‘వర్జిన్ బాయ్స్’ టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన చిత్రం. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహాన్, మిత్రా శర్మతో పాటు గీతానంద్, జెనీఫర్ ఇమ్మానుయేల్, రోనీత్ రెడ్డి వంటి నటీనటులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. రాజా దారపునేని నిర్మాణంలో, గీతానంద్ సోదరుడు దయానంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు’ వంటి ప్రమోషనల్ ఆఫర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా ఆ ఆసక్తిని ఎంతవరకు నిలబెట్టింది? ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం.

కథ :
ఒక యూనివర్సిటీలో డుండీ (శ్రీహాన్), ఆర్య (గీతానంద్), రోనీ (రోనీత్ రెడ్డి) స్నేహితులుగా చదువుకుంటారు. కాలేజీలో అందరికీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉండగా, తమకు లేరనే నిరాశలో ఉన్న వీరిని వారి స్నేహితుడు (కౌశల్) మరింత రెచ్చగొడతాడు. “నేను అమెరికా నుంచి తిరిగి వచ్చేలోపు మీరు వర్జినిటీ కోల్పోవాలి” అని సవాల్ విసురుతాడు. ఈ సవాల్‌ను స్వీకరించిన ముగ్గురు స్నేహితులు, ముగ్గురు అమ్మాయిలతో ప్రేమలో పడతారు – డుండీ జెనీఫర్‌తో, ఆర్య సరయు (మిత్రా శర్మ)తో, రోనీ శ్లోక (అన్షులా ధావన్)తో. అయితే, వారి ప్రేమ జీవితంలో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. చివరికి ఈ ప్రేమ జంటలు ఒక్కటయ్యారా? వర్జినిటీ కోల్పోవడమే లక్ష్యంగా పెట్టుకున్న వీరు తమ సవాల్‌లో గెలిచారా? ఇవన్నీ తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాలి.

విశ్లేషణ:
తెలుగులో అడల్ట్ కామెడీ సినిమాలు అరుదుగా వస్తాయి. ‘వర్జిన్ బాయ్స్’ ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అడల్ట్ కామెడీ సినిమానా అనిపించినా, థియేటర్‌లో చూసిన తర్వాత అది పూర్తిగా అడల్ట్ కామెడీ కాదని తెలుస్తుంది. కొన్ని బోల్డ్ జోక్స్ ఉన్నప్పటికీ, ఈ సినిమా ప్రధానంగా యూత్‌ను టార్గెట్ చేసింది. కాలేజీలో కొత్తగా చేరిన యువతలో చాలామందికి గర్ల్‌ఫ్రెండ్ ఉండాలని, వర్జినిటీ కోల్పోవాలని కోరిక ఉంటుంది. అయితే, వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమనే సందేశంతో ఈ సినిమాను రూపొందించారు. అక్కడక్కడ బోల్డ్ జోక్స్, స్కిన్ షో ఉన్నప్పటికీ, “ప్రేమే ముఖ్యం, సెక్స్‌కు కూడా ప్రేమ ఆధారం” అనే సందేశం ఆకట్టుకుంది. అయితే, గొప్ప కథ లేదా కథనం ఆశించి వెళితే నిరాశ తప్పదు. అమెచ్యూర్ కాలేజీ ప్రేమ కథలను కలిపి, యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చేసిన విధానం బాగుంది. ‘మ్యాడ్’ వంటి సినిమాల ఛాయలు కనిపించినా, వర్జినిటీ కోల్పోవడానికి సిద్ధమైన ముగ్గురు యువకుల కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు. కొత్తదనం లేకపోయినా, యూత్‌ను ఆకర్షించే అంశాలతో కథనం నడిచింది.

నటీనటుల నటన:
శ్రీహాన్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అతని సహజమైన నటన, కామెడీ టైమింగ్ ప్రేక్షకులను నవ్వించాయి. గీతానంద్ కూడా సులభంగా, ఈజ్‌తో నటించాడు. రోనీత్ రెడ్డి తన పాత్రలో పర్వాలేదు. మిత్రా శర్మ కొంత బొద్దుగా కనిపించినప్పటికీ, తన శైలిలో నటించి ఆకట్టుకుంది. జెనీఫర్ ఇమ్మానుయేల్ సాధారణంగా నటించగా, అన్షులా ధావన్ తన పాత్రలో ఒదిగిపోయింది. నటి మధుమణి కుమారుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించాడు. బంచిక్ బబ్లు మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు.

సాంకేతిక విశ్లేషణ:
స్మరణ్ సాయి అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నేపథ్య సంగీతం సన్నివేశాలకు తగ్గట్టు బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది, సినిమాటోగ్రఫీ సినిమాను రంగులమయంగా చూపించింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

సారాంశం:
‘వర్జిన్ బాయ్స్’ బోల్డ్ కామెడీతో కూడిన యూత్‌ఫుల్ సినిమా, చివర్లో ఒక సందేశంతో ఆకట్టుకుంది. యూత్‌ను ఎంగేజ్ చేసే అంశాలతో, సరదాగా చూడదగిన చిత్రం.

రేటింగ్: 3/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *