Virat Kohli: టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ టెస్టులను రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం కోహ్లీ లండన్ లో ఉంటున్నాడు. ఈ క్రమంలో కోహ్లీకి సంబంధించిన ఓ ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ గా మారింది. అమిత్ భాటియా ఈ వీడియోను షేర్ చేశారు.
2007లో అమిత్ భాటియా తన కాలేజ్ ప్రాజెక్ట్ కోసం రంజీ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, పునీత్ బిష్ట్‌లను ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూలో ఢిల్లీకి చెందిన ఇద్దరు సీనియర్ రంజీ క్రికెటర్లు పాల్గొనాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో వారు వెనక్కి తగ్గడంతో.. విరాట్ కోహ్లీ, పునీత్ బిష్ట్‌లను ఈ ఇంటర్వ్యూకి పంపారు. ఆ ఇంటర్వ్యూలో విరాట్ కోహ్లీ తన పరిణతి చెందిన ప్రసంగంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.
2007లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ ఆడటానికి వెస్టిండీస్‌కు వెళ్లింది. ఈ ఇంటర్వ్యూలో ఈసారి భారత జట్టు ప్రపంచ కప్ గెలుస్తుందా అని అడుగుతారు. అప్పుడు పునీత్ బిష్ట్ ‘‘మా జట్టు సమతుల్యంగా ఉంది. మా జట్టులో ఇద్దరు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు ఉన్నారు. భారత్ ప్రపంచ కప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’’ అన్నాడు. అదే ప్రశ్నకు సమాధానమిస్తూ విరాట్ కోహ్లీ, ‘‘నేను కూడా పునీత్ తో ఏకీభవిస్తున్నాను’’ అని అన్నాడు. కాగితంపై జట్టు బాగుంది కానీ మైదానంలో ఎలా ఆడతామనేదే ముఖ్యమని కోహ్లీ అన్నాడు.
ఇది కూడా చదవండి: Ben Duckett: బెన్ డకెట్ ప్రపంచ రికార్డు
ఇంతలో జట్టు ఎంపికలో వీరేంద్ర సెహ్వాగ్‌ను ఎంపిక చేయడం సరైనదేనా? అని అడగ్గా.. విరాట్ కోహ్లీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. సెహ్వాగ్ అనుభవజ్ఞులైన ప్లేయర్. పెద్ద టోర్నమెంట్లకు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అవసరం. సెహ్వాగ్ ఎంపిక సరైనదేనని చెబుతూ కోహ్లీ వీరూకు మద్ధతుగా నిలిచాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీ అండర్ -19 ప్రపంచ కప్ గెలిచి టీం ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇప్పుడు కోహ్లీ ప్రపంచ క్రికెట్ ఐకాన్‌గా ఎదిగాడు. ఈ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
2007 ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌లో రాహుల్ ద్రవిడ్ నేతృత్వంలోని టీమిండియా గ్రూప్ దశలోనే అవమానకరమైన ఓటమిని చవిచూసింది. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, శ్రీలంక చేతిలో ఓడిపోయింది. అదే ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో, టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ బెర్ముడాపై సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు. ఆ ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్.