Retirement: దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, టీమిండియా మూడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ మ్యాచ్ లో టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే, ఈ ఫైనల్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నారనే ప్రచారాలు వచ్చాయి. మ్యాచ్ తర్వాత రోహిత్ ఈ విషయంపై స్పష్టత చేశాడు.
రెండు ఐసీసీ ట్రోఫీలను వరుసగా గెలవడం ఒక జట్టుకు గొప్ప విజయం. చాలా తక్కువ జట్లు మాత్రమే ఇలాంటి విజయాలు సాధిస్తాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేం బాగా సిద్ధం అయ్యాం. ముందున్న సవాళ్లను ఎదుర్కొని ఆడటం చాలా ముఖ్యం. మేం పరిస్థితులను అర్థం చేసుకుని, వాటిని సరిగ్గా ఉపయోగించుకున్నాం. ఈ విజయం మాకు గర్వకారణం అని రోహిత్ అన్నాడు.
భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగిన ప్రశ్నకు రోహిత్ స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. నాకు భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు లేవు. జరగాల్సింది అదే జరుగుతుంది. నేను ఇంకా ఈ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వాలని ప్రకటించలేదు. నా రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రచారం చేయొద్దు అని ఆయన తేల్చి చెప్పాడు.
ఇది కూడా చదవండి: Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ప్రెజెంటేషన్‌కు ఎందుకు వెళ్లలేదు?: పీసీబీ తీరుపై అక్తర్ ఆగ్రహం
రోహిత్ ఈ సమాధానం అతని ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని నింపింది. హిట్‌మ్యాన్ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడతాడని, అప్పటివరకు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడని అందరూ భావించారు.
మరోవైపు, విరాట్ కోహ్లీ కూడా తన రిటైర్మెంట్ గురించి స్పష్టత చేశాడు. మనం జట్టు నుంచి వెళ్లాలనుకున్నప్పుడు, జట్టును బాగా స్థిరపరచి, ఉత్తమ స్థితిలో ఉంచి వెళ్లాలి. వచ్చే 8-10 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి మా జట్టు బలంగా, సిద్ధంగా ఉంది అని కోహ్లీ అన్నాడు.
శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. కేఎల్ రాహుల్ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. నేను ఈ జట్టులో ఉండి, నా అనుభవాన్ని వారికి అందించి, ఆ తర్వాతే రిటైర్ అవుతాను అని కోహ్లీ తేల్చి చెప్పాడు.