Viral News: పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్న ఈ రోజుల్లో అదే బంగారం ఓ 40 తులాలు దొరికితే.. లక్షలకు అధిపతినని అనుకుంటారు.. కానీ, ఓ ప్రయాణికుడు తనది కానిది తనకు చెందబోదన్న నీతిని నమ్ముకున్నాడు. సుమారు 50 లక్షల విలువైన బంగారాన్ని పోగొట్టుకున్న వ్యక్తికి అప్పగించి శభాష్ అనిపించుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది.
Viral News: సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి వసుధ, ప్రకాశ్ దంపతులు తమ మనవరాలి పెళ్లి కోసం గురువారం హైదరాబాద్ నగరంలో 39 తులాల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొన్నారు. అనంతరం వారు ఆర్టీసీ బస్సులో తమ ఇంటికి ప్రయాణం చేశారు. గమ్యం చేరుకున్నాక, బస్సు దిగి ఇంటికి చేరుకున్నాక, తమ వెంట ఉండాల్సిన బంగారం ఉన్న పర్సు కనిపించలేదు.
Viral News: బంగారం లేకపోయేసరికి గుండె ఆగినంత పనైంది ఆ దంపతులకు. తాము వచ్చిన బస్సులోనే పర్సును మరిచి ఉంటామని భావించి వసుధ దంపతులు వెంటనే ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి డిపో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. విచారిస్తామని వారు ఆ దంపతులకు హామీ ఇచ్చారు. అయితే అదే బస్సులో వారితోపాటు మెదక్ జిల్లా కోరంపల్లికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి కూడా ప్రయాణించాడు.
Viral News: సంగారెడ్డిలో వారు బస్సు దిగి వెళ్లిపోగానే, అదే సీటులో వారు వదిలి వెళ్లిన పర్స్ కనిపించింది. దీంతో దుర్గయ్య ఆ పర్స్‌ను కండక్టర్‌కు అప్పగించాడు. అలా కండక్టర్ ఆ పర్స్‌ను సంగారెడ్డి డిపో మేనేజర్ ఉపేందర్‌కు అందజేశాడు. ఆ వెంటనే వసుధ దంపతులను పిలిపించి, వారు బంగారం కొన్న చీటీని పరిశీలించి, ఆ బంగారం వారిదేనని నిర్ధారించుకున్నాక ఆ బంగారాన్ని అప్పగించారు.
Viral News: తనకు దొరికిన బంగారాన్ని అప్పగించి నిజాయితీ చాటుకున్న దుర్గయ్యను ఆర్టీసీ డిపో మేనేజర్, ఇతర అధికారులు సన్మానించారు. తాము పోగొట్టుకున్న బంగారాన్ని తిరిగి అప్పగించిన దుర్గయ్యతోపాటు ఆర్టీసీ అధికారులకు వసుధ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. దొరికిన విలువైన బంగారాన్ని అప్పగించిన ఆ నిజాయితీపరుడిని తోటి గ్రామస్థులు అభినందనలతో ముంచెత్తారు.