Vinayaka Chavithi:వినాయకుడు దేవతా మూర్తులలో ప్రత్యేకతలు ఎన్నో కలిగి ఉన్నాడు. పార్వతీ తనయుడైన వినాయకుడే దేవతలందరిలో తొలుత పూజలందుకుంటాడు. అయితే ఆయన ఆకారంలో కూడా అనేక ప్రత్యేకతలు మనకు కనిపిస్తాయి. అసలు వినాయకుడి ప్రతి అంశం మానవ జీవితంలో ఎన్నో విశేషాలకు ప్రతీకగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. భారీ తొండం, చెవులు, బొజ్జ, వాహనం అన్నీ ప్రత్యేకతలే కలిగి ఉన్నాయని, వాటికి పరిపరి అర్థాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి.
Vinayaka Chavithi:వినాయకుడి పెద్ద తల చక్కటి ఆలోచనకు ప్రతీక అని చెప్తారు. చిన్నగా ఉండే కళ్లు నిశిత పరిశీలనకు గుర్తుగా మనకు బోధపడుతుంది. ఆయన ఓ చేతిలో ఉండే దండం శరణాగతులను ఉద్దరించడానికి అని సూచిస్తుంది. చిన్నగా ఉండే నోరు ఆచితూచి మాట్లాడమని చెప్తున్నది. భారీగా ఉండే తొండం అత్యుత్తమ సామర్థ్యం, దేనినైనా స్వీకరించడాన్ని సూచిస్తుంది. చేతిలో ఉండే లడ్డు భక్తులకు పురస్కారాలను అందజేసే సూచికగా ఉంటుంది.
Vinayaka Chavithi:అదే విధంగా చేటలాంటి చెవులు భక్తులందరి మొర వినడానికి అని సూచిస్తుంది. కుడివైపు ఓ చేతిలో ఉండే గొడ్డలి మానవుడిని బంధ విముక్తుడిని చేయడాన్ని చెప్తుంది. వినాయకుడికి ఉండే ఏకదంతం చెడును వదిలించుకొని, మంచిని మాత్రమే నిలుపుకోవడాన్ని సూచిస్తుంది. ఆయన అభయహస్తం ఆధ్యాత్మిక చింతనలో భక్తులకు భక్తులకు మోక్షమార్గం ప్రసాదించడం. భారీ బొజ్జ జీవితంలో అన్ని మంచి చెడులన్నింటినీ ఇముడ్చుకోవడాన్ని సూచిస్తుంది.
Vinayaka Chavithi:ప్రసాదం కోరిన వరాలను ఇస్తుందని చెప్తుంది. ఎలుక కోరికలకు చిహ్నం. ఇవి ఎంత చిన్నగా ఉంటే జీవితం అంత సుఖమయం. కోరికలను ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలని సూచిస్తుంది. జగన్మాత రూపకల్పన చేసిన ఈ వినాయకుడి ప్రతి అవయవం మానవాళికి దివ్య సందేశాలను ఇస్తుంది. చూడగానే ఆకట్టుకునే ఆ సుందరరూపం వెనుక అనంతమైన అంతరార్థం ఇమిడి ఉన్నది.