Vijayendra Prasad: ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన ‘మాతా రాంబాయి అంబేడ్కర్ మెమొరియల్ అవార్డుల’ ప్రధానోత్సవంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కుల వివక్ష, అంటరానితనంపై ఆయన వ్యక్తం చేసిన పశ్చాత్తాపం సభికులను కదిలించింది. తన పూర్వీకులు చేసిన తప్పులకు బాధ్యత వహిస్తూ ఆయన వేదికపైనే కన్నీటి పర్యంతమయ్యారు.
సిగ్గుతో తలవంచుకుంటున్నా..
విజయేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో తన కుటుంబ నేపథ్యం గురించి వివరిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు..తమది చాలా సంపన్న కుటుంబమని, కానీ తన పూర్వీకులు అంటరానితనం పేరుతో నోటితో చెప్పలేనంత దారుణాలకు, భయంకరమైన ఘోరాలకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ దారుణాలకు ఒడిగట్టిన వారి రక్తమే నాలో ప్రవహిస్తోంది.. వారి ఆస్తులనే నేను అనుభవిస్తున్నాను. అందుకే ఆ పాపాల్లో నేను కూడా భాగస్వామినే అని ఆయన వ్యాఖ్యానించారు. ఆనాటి పరిస్థితులను తలుచుకుంటే మనసు సిగ్గుతో చచ్చిపోతుందని చెబుతూ, పూర్వీకుల తరఫున అందరికీ తలవంచి క్షమాపణలు కోరారు.
నా తండ్రికి కులపిచ్చి లేదు
పూర్వీకుల తప్పులను ఎండగట్టిన ఆయన, తన తండ్రి గొప్పతనాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు జాన్ ఫెడ్రిక్ సుందర్ రావు మాల సామాజిక వర్గానికి చెందినవాడని, అయినప్పటికీ తన తండ్రి ఏమాత్రం వివక్ష చూపలేదని చెప్పారు. తన స్నేహితుడికి కూడా తండ్రే ఫీజులు కట్టి, తనతో పాటు రూమ్‌మేట్‌గా ఉంచి చదివించారని గుర్తు చేసుకున్నారు.
అంబేడ్కర్ సినిమాకు సిద్ధం
ప్రస్తుతం తన కార్యాలయంలో కేవలం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రం మాత్రమే ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఆ మహనీయుడి జీవితంపై ఒక అద్భుతమైన సినిమా కథను రాస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. అంటరానితనం అనే సామాజిక రుగ్మతపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
