Terrorists: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో ఉగ్రవాద మూలాలు కలకలం రేపుతున్నాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో కౌంటర్ ఇంటెలిజెన్స్ (CI) మరియు విజయవాడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి షరీఫ్, డానిష్, సొహైల్ బేగ్ అనే ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైన వీరు, నగరంలో విచ్ఛిన్నకర చర్యలకు ప్లాన్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను (ఈరోజు )మంగళవారం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు.
‘BENX’ గ్రూపు ద్వారా నెట్‌వర్క్ విస్తరణ
నిందితులు ‘BENX’ అనే రహస్య సోషల్ మీడియా గ్రూపును వేదికగా చేసుకుని తమ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరికి విదేశాల్లో ఉంటున్న అల్-హకీమ్ షుకూర్ అనే హ్యాండ్లర్ నిరంతరం సూచనలు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతను ఉగ్రవాదం వైపు మళ్లించడం, దేశ వ్యతిరేక పోస్టులను షేర్ చేయడం వంటి పనులను వీరు ఈ గ్రూపు ద్వారా నిర్వహిస్తున్నారు. వీరి వద్ద నుంచి కీలకమైన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్, బిహార్ లింకులు.. సయీదా బేగం కోసం గాలింపు
ఈ కేసులో అంతర్రాష్ట్ర లింకులు కూడా బయటపడ్డాయి. హైదరాబాద్‌కు చెందిన సయీదా బేగం, బిహార్‌కు చెందిన దిల్కాష్ అనే వ్యక్తులు ఈ ముగ్గురు యువకులను ఆపరేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. హ్యాండ్లర్ అల్-హకీమ్ సూచనల మేరకు సయీదా బేగం, దిల్కాష్‌తో కలిసి విజయవాడ యువకులకు శిక్షణ మరియు ఇతర సహాయ సహకారాలు అందిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం సయీదా బేగం పరారీలో ఉండటంతో ఆమె కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
మరో 10 మంది నిఘాలో..
అరెస్టయిన ముగ్గురు నిందితులతో మరో పదిమంది యువకులు నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరంతా కూడా BENX గ్రూపులో సభ్యులుగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పదిమంది కదలికలపై పోలీసులు నిశితంగా నిఘా ఉంచారు. విజయవాడ వంటి ప్రశాంతమైన నగరంలో ఇలాంటి ఉగ్రవాద మూలాలు బయటపడటం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.
