Vijayawada: విజయవాడలో ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. భవానీపురం ప్రాంతానికి చెందిన మేరారామ్ (12), ఉమారామ్ (13) అనే ఇద్దరు పిల్లలు బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయారు. వీరిద్దరూ స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజూలాగే తల్లి బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆర్.ఆర్. దర్బార్ సమీపంలో ఉన్న ట్యూషన్ సెంటర్ వద్ద వారిని దించింది. అయితే, లోపలికి వెళ్లాల్సిన పిల్లలు.. తల్లి వెళ్లగానే ట్యూషన్‌కు వెళ్లకుండా బయటే ఉండిపోయారు.
ఆ తర్వాత వారు అక్కడ ఒక ఆటో ఎక్కి వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు ట్యూషన్ సెంటర్ వద్ద ఆరా తీశారు. వారు అసలు ట్యూషన్‌కే రాలేదని తెలియడంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు వెంటనే భవానీపురం పోలీసులను ఆశ్రయించారు. తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.
ప్రస్తుతం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పిల్లల కోసం గాలిస్తున్నారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను జల్లెడ పడుతున్నారు. ట్యూషన్ సెంటర్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని సేకరించి, వారు ఆటోలో ఎటువైపు వెళ్లారో గుర్తించే పనిలో ఉన్నారు. ట్యూషన్‌కు వెళ్లిన పిల్లలు ఇలా మాయం కావడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని కోరుతున్నారు.
