Vijayashanti: ప్రముఖ సినీ నటి విజయశాంతి మళ్లీ క్రియాశీలకం కానున్నారా? ఆ మేరకు ఎమ్మెల్సీ సీటు కోసం ప్రయత్నిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కలిశారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. త్వరలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఒక సీటు బీఆర్ఎస్కు వెళ్లినా, నాలుగు సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నది. మూడు సీట్లను అయితే సునాయాసంగా గెలుచుకున్నా, మరో సీటుకు కష్టపడాల్సి వస్తుంది.
Vijayashanti: నాలుగు సీట్లలో ఇప్పటికే తమకో సీటు ఇవ్వాలని సీపీఐ కోరుతున్నది. ఇక మిగిలింది మూడు సీట్లే. వాటిలో ఒక సీటు విషయంలో ఎంఐఎంకి ఇచ్చే విషయం చర్చ జరుగుతున్నది. ఉన్న సీట్ల విషయంలో సామాజిక వర్గాల వారీగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఒకటి రెడ్డి, మరొకటి ఎస్సీ, ఇంకొకటి బీసీకి ఇవ్వాలని ఒక అంగీకారానికి వచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు అధిష్టానంతో కూడా చర్చలు జరిగినట్టు తెలిసింది. ఓ దశలో వారి పేర్లు కూడా అధిష్టానికి ప్రతిపాదనలు వెళ్లినట్టు సమాచారం.
Vijayashanti: ఈ నేపథ్యంలో విజయశాంతి తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని కోరుతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు ఆమె అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను స్వయంగా కలిసి సీటు విషయంపై తన మనసులోని మాటను వ్యక్తంచేసినట్టు సమాచారం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు తనకు కేటాయించాలని ఇతర పెద్దలను కూడా కలిసినట్టు తెలుస్తున్నది.
Vijayashanti: కాంగ్రెస్ పార్టీ కోసం తాను చేసిన త్యాగాలను పరిగణనలోకి తీసుకోవాలని అధిష్టానం పెద్దలను విజయశాంతి కోరినట్టు తెలుస్తున్నది. బీజేపీ నుంచి బీఆర్ఎస్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి గత ఎన్నికల ముందు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి చేరారు. ఎన్నికల అనంతరం విజయశాంతి క్రియాశీలకంగా లేకుండాపోయారు. కొంతకాలం రాజకీయ కార్యకలాపాల్లో కనిపించినా, ఆరు నెలల తర్వాత నుంచి కనిపించకుండానే పోయారు. ఇప్పుడు మళ్లీ క్రియాశీలకం అయ్యేందుకు ముందుకు వస్తున్నారు.
