Vijayasaireddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇటీవలే నిష్క్రమించిన మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీ లోపల జరిగిన పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరిగిన అవమానాలు, కోటరీ రాజకీయాల గురించి వివరించారు.
“నా గురించి మా నాయకుడిని (వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని) కొంతమంది తప్పుదారి పట్టించారు. రెండవ స్థానం నుంచి నన్ను రెండువేలవ స్థానానికి దించారు,” అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు విజయసాయి.
వైసీపీలో తనకు స్థానం తగ్గిన విధానం, పక్కన పెట్టిన తీరుపై విమర్శలు గుప్పించిన ఆయన, “జగన్ మనసులో నాకు స్థానం లేదని అర్థమైన తర్వాతే బయటకు వచ్చాను,” అన్నారు.
అంతేకాకుండా, తనపై ఇప్పటికీ దుష్ప్రచారాలు కొనసాగుతున్నాయని, పార్టీకి నిబద్ధంగా పనిచేసిన తనను చివరకు కోటరీల వత్తిడితో తప్పించారు అని ఆరోపించారు. “అవమానాలు, వేధింపులు ఎదుర్కొన్న తరువాతే YCPని వీడాను,” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీకి ఇచ్చిన సేవలను తక్కువగా చూసిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పార్టీలో వాస్తవ పరిస్థితులు బయటపెడతానని స్పష్టం చేశారు.