Vijayasaireddy: కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియ అన్నీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డేనని మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసుకు సంబంధించి సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డిని విచారించగా, విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారని, ముఖ్యంగా విక్రాంత్ రెడ్డే ఇందులో ప్రధాన పాత్ర పోషించాడని తెలిపారు.
విక్రాంత్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి కుమారుడిగా తనకు తెలుసని, ఈ విషయాన్ని సీఐడీ అధికారులకు చెప్పినట్లు తెలిపారు. కామన్ ఫ్రెండ్ ద్వారా పోర్టు యజమాని కేవీ రావును విక్రాంత్ రెడ్డికి పరిచయం చేశానని, కానీ కేవీ రావుతో తనకు ఎలాంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు.
జగన్‌కు సంబంధం లేదని స్పష్టీకరణ
సీఐడీ అధికారులు తాను సీఎం జగన్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నానా అని ప్రశ్నించగా, ఈ కేసుకు జగన్‌కు ఎలాంటి సంబంధం లేదని తాను చెప్పినట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. కేవీ రావు, వైవీ సుబ్బారెడ్డికి మంచి సాన్నిహిత్యం ఉందని, వైవీ సుబ్బారెడ్డి అమెరికా వెళ్లినప్పుడల్లా కాలిఫోర్నియాలో కేవీ రావుకు చెందిన రాజభవనంలోనే ఉండేవారని తెలిపారు.
ఈ వ్యవహారం పూర్తిగా విక్రాంత్ రెడ్డే డీల్ చేసాడని, ఈ విషయాన్ని కామన్ ఫ్రెండ్స్ ద్వారా కేవీ రావు చెప్పినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారం గురించి తనకు పూర్తిగా తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలను వెల్లడిస్తానని విజయసాయిరెడ్డి తెలిపారు.
కేవీ రావుపై విమర్శలు
కేవీ రావు రాజకీయ బ్రోకర్ అని, ఆయనంటే తనకు అసహ్యం అని విజయసాయిరెడ్డి అన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నానని తెలిపారు.
ఇంతకుముందు ఒక నాయకుడిపై భక్తి ఉండేదని, కానీ ఇప్పుడు దేవుడిపై మాత్రమే భక్తి ఉందని అన్నారు. జగన్ తనపై ప్రలోభాలకు లొంగిపోయానని ఆరోపించినా, తాను ఎప్పుడూ ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో తనపై ఏవైనా విమర్శలు వచ్చినా, వాటిని పట్టించుకోనని తెలిపారు.

